: స్టీఫెన్ వాంగ్మూలం... కేసీఆర్ అల్లిన పిట్టకథ: జెరూసలెం మత్తయ్య ఆరోపణ
ఓటుకు నోటు కేసులో తెలంగాణ నామినేటెడ్ ఎమ్మెల్యే ఎల్విస్ స్టీఫెన్ సన్ కోర్టుకు ఇచ్చిన వాంగ్మూలాన్ని కేసీఆర్ అల్లిన పిట్టకథగా జెరూసలెం మత్తయ్య ఆరోపించారు. ఈ కేసులో నాలుగో నిందితుడిగా ఉన్న మత్తయ్య నిన్న విజయవాడలో ఓ తెలుగు దినపత్రికతో మాట్లాడిన సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ సీఎం కేసీఆర్, టీఆర్ఎస్, తెలంగాణ ఏసీబీ అధికారులు మూకుమ్మడిగా స్టీఫెన్ సన్ తో కోర్టుకు పిట్టకథ వినిపించాయని మత్తయ్య ఆరోపించారు. దీనిని నిర్ధారించుకునేందుకు కేసీఆర్, స్టీఫెన్ సన్ లకు సత్యశోధన పరీక్షలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. తెలంగాణ అసెంబ్లీకి ఎమ్మెల్యేగా నామినేట్ కావడానికి స్టీఫెన్ సన్ రూ.1.2 కోట్లను చెల్లించుకున్నారని, ఇందులో కేసీఆర్ కు రూ.80 లక్షలు, మధ్యవర్తులు, టీఆర్ఎస్ కు రూ.40 లక్షలు అందాయని చెప్పారు. ఈ విషయాలను స్టీఫెన్ సనే స్వయంగా తనకు చెప్పారని తెలిపారు. రూ.1.20 కోట్లు సమర్పించుకున్న స్టీఫెన్ సన్ అప్పుల్లో కూరుకుపోయి వాటి నుంచి తేరుకునేందుకు తక్కువ వడ్డీకి రుణం కోసం యత్నించారన్నారు. ఈ విషయంలో స్టీఫెన్ సన్ తనను బతిమాలారని, ఇదే విషయాన్ని తాను క్రైస్తవ సంఘాల నాయకులకు తెలిపానన్నారు. టీఆర్ఎస్ నేతల నుంచి ఎదురైన అవమానాలకు ప్రతిగా ఆ పార్టీకి వ్యతిరేకంగా ఓటు వేసి బుద్ధి చెప్పాలని స్టీఫెన్ సన్ నిర్ణయించుకున్నారన్నారు. ఈ విషయం తెలిసిన కేసీఆర్, స్టీఫెన్ సన్ ను చంపేస్తానని, పదవి రద్దు చేయిస్తానని బెదిరించారని తెలిపారు. దీంతోనే స్టీఫెన్ సన్ కోర్టుకు అందమైన అబద్ధం చెప్పారని మత్తయ్య విమర్శించారు.