: ‘సండ్ర’ నోటీసులు ‘ధూళిపాళ్ల’కు ఇవ్వబోయారట...టీ ఎసీబీపై ఏపీ ఎమ్మెల్యే ‘ఉల్లంఘన’ నోటీసు!


ఓటుకు నోటు కేసులో తెలంగాణ అవినీతి నిరోధక శాఖాధికారులు దూకుడుగా వ్యవహరించారు. ఆ దూకుడులో ఒక ఇంటి తలుపు తట్టాల్సిన ఆ శాఖ అధికారులు మరో ఇంటి తలుపు తట్టారు. అంతేకాక సదరు ఇంటిలోకి చొచ్చుకెళ్లారు. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఆ ఇంటి యజమాని ఏసీబీ అధికారులకు నోటీసులు జారీ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. వివరాల్లోకెళితే... ఓటుకు నోటు కేసులో ఖమ్మం జిల్లా సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య(టీ టీడీపీ)కు కూడా ప్రమేయం ఉందని భావించిన ఏసీబీ, విచారణకు హాజరుకావాలని ఆయనకు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. గతవారం ఓ రోజు రాత్రి పొద్దుపోయిన తర్వాత ఆయనకు జారీ అయిన నోటీసులను అందించే విషయంలో ఏసీబీ అధికారులు తప్పులో కాలేశారు. హైదర్ గూడలోని ఎమ్మెల్యే క్వార్టర్స్ కు నోటీసులతో వెళ్లిన ఏసీబీ, సండ్ర ఇంటి తలుపు తట్టబోయి పక్కనే ఉన్న ఏపీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రకుమార్ (టీడీపీ) ఇంటి తలుపు తట్టారు. ఇది సండ్ర నివాసం కాదన్న అక్కడి సిబ్బంది మాటలను వినిపించుకోకుండా ఓ అధికారి లోపలికి వెళ్లారట. ఆ తర్వాత నాలిక్కరుచుకుని వెనక్కు వచ్చేశారు. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన ధూళిపాళ్ల నరేంద్ర తెలంగాణ ఏసీబీ అధికారులకు సభా హక్కుల ఉల్లంఘన నోటీసులు జారీ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే ఈ విషయంపై ఆయన ఏపీ అసెంబ్లీ స్పీకర్, డీజీపీలకు లేఖలు రాశారు. స్పీకర్ అనుమతి లేకుండా రావడమే కాక అర్ధరాత్రి తనను ఇబ్బందిపెట్టిన టీ ఏసీబీ అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన ఆ లేఖల్లో కోరారు. తాజాగా తెలంగాణ ఏసీబీపై ఏపీ అసెంబ్లీలో సభా హక్కుల ఉల్లంఘన నోటీసు ఇచ్చేందుకు ఆయన సిద్ధపడ్డట్టు విశ్వసనీయ సమాచారం.

  • Loading...

More Telugu News