: అది ఎలుక కాదు చికెన్ ముక్క... కేఎఫ్ సీకి ఊరట
కొన్నిరోజుల క్రితం అమెరికాలో ఓ కస్టమర్ కు చికెన్ కు బదులు ఎలుకను అందించారంటూ కేఎఫ్ సీ సంస్థపై దుమారం రేగింది. కాలిఫోర్నియాలోని వాట్స్ ప్రాంతానికి చెందిన డెవోరైజ్ డిక్సన్ అనే వ్యక్తి తన ఫేస్ బుక్ ఖాతాలో ఎలుకలా కనిపిస్తున్న వంటకం తాలూకు ఫొటోను జూన్ 12న పోస్టు చేశాడు. దాన్ని ఉద్దేశించి క్యాప్షన్ రాశాడు. "కేఎఫ్ సీ రెస్టారెంటుకు మరోసారి వెళ్లాను. మేనేజర్ తో మాట్లాడితే, అది ఎలుకేనంటూ క్షమాపణలు తెలిపాడు. ఇప్పుడు లాయర్ తో పనిబడింది. ఫాస్ట్ ఫుడ్ తినకండి, ఆరోగ్యం జాగ్రత్త!" అని పేర్కొన్నాడు. దీంతో, వేలాదిమంది కస్టమర్లు కేఎఫ్ సీ ఫేస్ బుక్ ఖాతాపై దండెత్తారు. ఇలా చేశారేంటి? అంటూ ప్రశ్నాస్త్రాలు సంధించారు. దీనిపై కేఎఫ్ సీ వెంటనే స్పందించింది. అది ఎలుకో, చికెన్ ముక్కో ల్యాబ్ లో పరీక్షించేందుకు గాను డిక్సన్ ను సంప్రదించేందుకు ప్రయత్నించింది. అయితే, అతడు అందుబాటులోకి రాలేదు. అయితే, శుక్రవారం అతని లాయర్ ఆ ముక్కను ఓ ల్యాబ్ కు అందించగా, వారు అది చికెన్ ముక్క అని తేల్చారు. ఈ ఫలితంతో ఊపిరి పీల్చుకున్న కేఎఫ్ సీ సంస్థ వెంటనే ఓ ప్రకటన విడుదల చేసింది. "ఇటీవలే అమెరికాలో ఓ కస్టమర్ కేఎఫ్ సీ ఉత్పాదన నాణ్యతను ప్రశ్నించాడు. ఆ ఉత్పత్తిని ఓ థర్డ్ పార్టీ ల్యాబ్ లో పరీక్షించగా, అది కచ్చితంగా చికెన్ ముక్కేనని నిర్ధారణ అయింది" అని వివరించింది.