: కెప్టెన్ ఆజ్ఞాపిస్తే ప్రాణాలైనా వదిలేస్తా: అశ్విన్
టీమిండియా ఆల్ రౌండర్ రవిచంద్రన్ అశ్విన్ మిర్పూర్ లో మంగళవారం మీడియా సమావేశానికి హాజరయ్యాడు. తాజా పరిణామాలపై మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలిచ్చాడు. బంగ్లాదేశ్ చేతిలో వన్డే సిరీస్ లో ఓటమిపాలైనా, జట్టంతా కెప్టెన్ ఎంఎస్ ధోనీ వెన్నంటే ఉందని అన్నాడు. డ్రెస్సింగ్ రూంలో లుకలుకలు లేవని పేర్కొన్నాడు. తన విషయానికొస్తూ, కెప్టెన్ కోరితే మైదానంలో ప్రాణాలు వదిలేందుకైనా సిద్ధమని స్పష్టం చేశాడు. క్లిష్ట పరిస్థితుల్లో కెప్టెన్ కు మద్దతుగా నిలవకపోతే, దాని పర్యవసానం కచ్చితంగా చవిచూడాల్సి ఉంటుందని అన్నాడు. "ఇప్పుడే కాదు, ఎప్పుడైనా గానీ కెప్టెన్ ఎవరైనా అతడికి మనం దన్నుగా నిలవాల్సిందే" అని స్పష్టం చేశాడు. ధోనీ భారత క్రికెట్ దిగ్గజాల్లో ఒకడని, దేశం కోసం ఎంతో చేశాడని అశ్విన్ వివరించాడు. తాజా ఫలితాల నేపథ్యంలో ధోనీ ఘనతలను విస్మరించలేమని అభిప్రాయపడ్డాడు.