: వైజాగ్ యువకుడి ప్రాణం మీదకు తెచ్చిన వినూత్న సెల్ఫీ ప్రయత్నం
యువతలో సెల్ఫీల పిచ్చి రోజురోజుకూ ముదురుతోంది. సోషల్ మీడియాలో స్నేహితులను ఆకట్టుకునేందుకు వినూత్నంగా సెల్ఫీలు తీసుకునేందుకు యువత ఆసక్తి చూపుతోంది. తాజాగా రాజమండ్రిలో అలాంటి ప్రయత్నమే చేసిన విశాఖపట్టణానికి చెందిన బీటెక్ యువకుడు ప్రాణాలమీదికి తెచ్చుకున్నాడు. వివరాల్లోకి వెళితే... వైజాగ్ కి చెందిన సంతోష్ కుమార్ అనే బీటెక్ విద్యార్థి, తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో రైలెక్కాడు. అందరూ రైలు బోగీల్లోకి ఎక్కితే, సంతోష్ మాత్రం రైలు టాప్ ఎక్కాడు. అక్కడ సెల్ఫీ తీసుకునేందుకు ప్రయత్నిస్తుండగా, రైలుకు విద్యుత్ సరఫరా చేసే హైటెన్షన్ వైరు తగిలింది. దీంతో సంతోష్ కాలిపోయాడు. అక్కడికి సమీపంలో ఉన్న సంతోష్ కుటుంబ సభ్యులు, బంధువులు అతడిని 108లో హుటాహుటిన ప్రైవేటు ఆసుపత్రికి తరలించినప్పటికీ పరిస్థితి విషమంగా ఉందని, అతనికి చికిత్స అందిస్తున్న వైద్యులు తెలిపారు.