: తొండి ఆట ఆడొద్దు...గవర్నర్ దే బాధ్యత: ఏపీ మంత్రి రావెల
ఏదైనా ఆటలో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయని ఏపీ మంత్రి రావెల కిషోర్ బాబు తెలిపారు. సెక్షన్ 8పై హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, ఆటలాగే రాష్ట్ర విభజన సందర్భంగాను రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ రూపొందించాయని అన్నారు. ఎవరైనా తొండి ఆట ఆడితే సరిదిద్దేందుకు రిఫరీని పెట్టినట్టే రెండు రాష్ట్రాలకు గవర్నర్ ను పెట్టారని ఆయన తెలిపారు. రెండు రాష్ట్రాల పోలీసులు హైదరాబాదులో ఎలా బాధ్యతలు నిర్వర్తిస్తాయని తెలంగాణ నేతలు ప్రశ్నిస్తున్నారని, ఢిల్లీలో రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలున్నప్పటికీ ఎలాంటి వివాదాలు లేకుండా పరిపాలన సాగుతుండడాన్ని గమనించాలని ఆయన సూచించారు. ఢిల్లీలో లెఫ్టినెంట్ గవర్నర్ తరహాలో ఇక్కడ గవర్నర్ బాధ్యతలు చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు. దేశ సార్వభౌమత్వాన్ని, రక్షణ వ్యవస్థకు కీలకమైన పలు రంగాలు హైదరాబాదులోనే ఉన్నాయని, వీటన్నింటినీ పరిరక్షించాలంటే గవర్నర్ పూర్తిగా శాంతి భద్రతల బాధ్యతను చేతుల్లోకి తీసుకోవాలని ఆయన చెప్పారు. ఇరు రాష్ట్రాల ప్రజలకు హైదరాబాదులో సమాన ప్రాతినిధ్యం, భాగస్వామ్యం, హక్కులు కల్పించే విధంగా గవర్నర్ చర్యలు తీసుకోవాలని ఆయన స్పష్టం చేశారు. సెక్షన్ 8 లో పేర్కొన్న విధంగా గవర్నర్ బాధ్యతలు స్వీకరించాలని ఆయన పేర్కొన్నారు.