: 'ఓటుకు నోటు' కేసును సెక్షన్ 8తో ముడిపెట్టవద్దు!: ఎంపీ కేకే


హైదరాబాద్ లో సెక్షన్ 8 అమలును పలువురు వ్యతిరేకిస్తుంటే టీఆర్ఎస్ ఎంపీ కె.కేశవరావు మాత్రం చాలా తేలిగ్గా తీసుకున్నారు. ఆ సెక్షన్ అమలు చేయడం వల్ల తెలంగాణకు ఏమీ కాదంటున్నారు. సెక్షన్ పై కొన్ని వర్గాలు అనవసర పుకార్లకు తెరలేపాయని అన్నారు. గవర్నర్ కు ఇంతవరకు సెక్షన్ 8పై సమాచారం లేదని కేకే పేర్కొన్నారు. అసలు 'ఓటుకు నోటు' కేసును సెక్షన్ 8తో ముడిపెట్టవద్దని ఆయన అన్నారు. తెలంగాణలో దొంగలను, కుట్రలు చేసే వాళ్లను వదలబోమని స్పష్టం చేశారు. టీఆర్ఎస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కేకే మాట్లాడారు. చట్ట ప్రకారమే ఏసీబీ నడుచుకుంటోందని, విచారణలో టీఆర్ఎస్ జోక్యం చేసుకోదని తెలిపారు. తెలంగాణ కేబినెట్ ను కాదని గవర్నర్ నిర్ణయాలు తీసుకోరన్నారు. దొంగలను పట్టుకోవద్దని సెక్షన్ 8లో లేదు కదా? అని ప్రశ్నించారు. శాంతిభద్రతల విషయంలో తెలంగాణ రాష్ట్రానికే పూర్తి హక్కులు ఉన్నాయన్నారు. కేబుల్ యాక్ట్ ప్రకారం టీ.న్యూస్ కు నోటీసులు ఇచ్చే అధికారం ఏపీ పోలీసులకు లేదన్నారు. కేసు నుంచి తప్పించుకునేందుకే సెక్షన్ 8పై చంద్రబాబు రాద్ధాంతం చేస్తున్నారన్న కేకే, 'టేపుల్లోని గొంతు నీది కాకుంటే జడ్జి ముందు ఆ విషయమే చెప్పా'లని చంద్రబాబును డిమాండ్ చేశారు.

  • Loading...

More Telugu News