: వైట్ హౌస్ లో ఒబామా ఇఫ్తార్ విందు
రంజాన్ మాసం సందర్భంగా అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా వైట్ హౌస్ లో సంప్రదాయ ఇఫ్తార్ విందు ఇచ్చారు. ఈ కార్యక్రమానికి అమెరికా ముస్లిం వర్గ ప్రముఖులు, పాకిస్థాన్, బంగ్లాదేశ్ వంటి ముస్లిం దేశాలకు చెందిన దౌత్యాధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఒబామా అతిథులనుద్దేశించి మాట్లాడారు. "మా విలువలకు ఎప్పుడైతే ప్రమాదం వాటిల్లిందో, అప్పుడు ఓ జాతిగా ఏకతాటిపై నిలిచాం. ఈ ఏడాది ఆరంభంలో చాపెల్ హిల్ ప్రాంతంలో ముగ్గురు యువ అమెరికన్ ముస్లింలు దారుణ హత్యకు గురయ్యారు, అప్పుడు ఆ కమ్యూనిటీకి అమెరికాలోని అన్ని మతాల ప్రజలు సంఘీభావం ప్రకటించారు. వారు ఎవరు? ఏ జాతికి చెందినవారు? వారు ఎవరిని పూజిస్తారు? ఎలా ఆరాధిస్తారు? అన్న అంశాల ఆధారంగా అమెరికన్లు ఎవరినీ లక్ష్యంగా చేసుకోరని ఉద్ఘాటిస్తున్నాం. అలాంటి ద్వేషపూరిత చర్యలను వ్యతిరేకిస్తున్నాం" అని స్పష్టం చేశారు.