: 15 కోట్ల కోసం వేధించాడు...250 కోట్లు ఇవ్వాల్సిందే!: సల్మాన్ పై బాలీవుడ్ నిర్మాత దావా
బాలీవుడ్ స్టార్ నటుడు సల్మాన్ ఖాన్ పై బాంబే హైకోర్టులో 'వీర్' సినిమా నిర్మాత విజయ్ గలానీ 250 కోట్ల రూపాయల పరువు నష్టం దావా వేశారు. బాక్సాఫీస్ వద్ద అట్టర్ ఫ్లాపై, తీవ్ర నష్టాలు తెచ్చిన 'వీర్' సినిమాకు 15 కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ చెల్లించాలంటూ బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ తీవ్ర ఒత్తిడి తెచ్చి వేధించాడని, అతని వేధింపులు తాళలేక అంతులేని మానసిక వేదన అనుభవించానని ఆయన పిటిషన్ లో పేర్కొన్నారు. తనను వేధించి, తన పరువుకు నష్టం కలిగేలా ప్రవర్తించిన సల్మాన్ ను 250 కోట్ల రూపాయలు చెల్లించేలా ఆదేశించాలని ఆయన న్యాయస్థానానికి విజ్ఞప్తి చేశారు. 'వీర్' సినిమా నిర్మాణానికి ముందు చేసుకున్న ఒప్పందంలో అప్పటి సల్మాన్ మార్కెట్ ను బట్టి 7 లేక 8 కోట్లు చెల్లించాలని, సినిమా సూపర్ హిట్ అయితే 15 కోట్లు చెల్లించాలని ఒప్పందం చేసుకున్నామని, అయితే సినిమా అట్టర్ ఫ్లాప్ అయినప్పటికీ సల్మాన్ 15 కోట్లు చెల్లించాలంటూ ఒత్తిడి చేసేవాడని ఆయన పిటిషన్ లో పేర్కొన్నారు. ఈ వివాదాన్ని తాను 'నిర్మాతల మండలి' దృష్టికి తీసుకెళ్తే...సల్మాన్ తనపై 'ఫెడరేషన్ ఆఫ్ వెస్ట్రన్ ఇండియా సినీ అసోసియేషన్' కు ఫిర్యాదు చేశాడని తెలిపారు. అయితే ఈ మూడేళ్లలో సల్మాన్ వేధింపుల కారణంగా తాను అంతులేని మానసిక వేదన అనుభవించానని, కోర్టు, న్యాయవాదుల ఫీజులు, ఇతర ఖర్చులు అంటూ తన దగ్గర ఉన్న మొత్తం ధనం ఖర్చైపోయిందని, అందువల్ల 250 కోట్ల పరువునష్టం దావా వేస్తున్నట్టు ఆయన పిటిషన్ లో న్యాయస్థానానికి తెలిపారు.