: కేరళ మార్కెట్ ను ముంచెత్తనున్న ఖైదీ మేడ్ షర్టులు!


భారత్ లోని జైళ్లలో సంస్కరణలు మరింత ఊపందుకున్నాయి. గతంలో వలే కాకుండా, ఇప్పుడు ఖైదీలకు ఉపాధి విషయంలో ఎన్నో అవకాశాలు కల్పిస్తున్నారు. వ్యవసాయం, వడ్రంగం, హోటళ్లు, బేకరీ రంగం... ఇలా ఎన్నో విధాల జైల్లోనే డబ్బు సంపాదించుకునే వీలు కలుగుతోంది. తాజాగా, కేరళలోని పూజప్పుర సెంట్రల్ జైలు ఖైదీలు చొక్కాలు కుడుతూ కొత్త మార్గంలో పయనిస్తున్నారు. వారు కుట్టిన చొక్కాలు ఓనం పండుగ నాటికి కేరళ మార్కెట్ ను ముంచెత్తనున్నాయి. ఇప్పటికే తక్కువ ధరకే చపాతీ-చికెన్ కర్రీ, మూడు మడతల గొడుగులతో బాగా పాప్యులరైన పూజప్పుర ఖైదీలు ఇప్పుడు తమ ప్రిజన్ బ్రాండు షర్టులతో పేరుమోసిన బ్రాండులతో పోటీ పడేందుకు సిద్ధమయ్యారు. మరో రెండు నెలల్లో ప్రధాన పండుగ ఓనం రానుందని, అప్పటికి ఖైదీలు కుట్టిన చొక్కాలను మార్కెట్లో విడుదల చేస్తామని జైలు ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. కాగా, తొలి దశలో ఒక్కో చొక్కాను రూ.260కే అందించాలని భావిస్తున్నారు. తక్కువ ధరకే నాణ్యమైన దుస్తులు అందించడానికి ప్రాధాన్యతనిస్తున్నామని ఆ అధికారి వివరించారు. పాప్యులర్ బ్రాండ్ల కంటే తమ దుస్తులే చవక అని అన్నారు.

  • Loading...

More Telugu News