: 'మూర్తీ... మూర్తీ...' ఇన్ఫోసిస్ ఏజీఎంలో షేర్ హోల్డర్ల మది దోచిన నారాయణమూర్తి


ఎన్ఆర్ నారాయణ మూర్తి... మరో ఆరుగురితో కలిసి సుమారు 34 ఏళ్ల క్రితం ఇన్ఫోసిస్ అనే చిన్న ఐటీ కంపెనీని ప్రారంభించి, దాన్ని ప్రపంచ స్థాయికి తీసుకెళ్లాడు. 1981లో ప్రారంభమైన ఈ సంస్థ వార్షిక సర్వసభ్య సమావేశాల్లో డయాస్ పై నుంచి 30 సార్లకు పైగా ప్రసంగించిన నారాయణమూర్తి, ఈ దఫా మాత్రం షేర్ హోల్డర్లకు కేటాయించిన సీట్లలో, కుటుంబ సభ్యులతో కలిసి ముందు వరుసకే పరిమితమయ్యారు. ఏజీఎంకు హాజరైన షేర్ హోల్డర్లు "మూర్తీ... మూర్తీ..." అంటూ హర్షధ్వానాలు చేస్తుంటే నవ్వుతూ ఉండిపోయారు. పలువురు ఆయన తిరిగి బోర్డులోకి రావాలని కోరితే, చిరునవ్వుతో "సంస్థ సురక్షిత చేతుల్లో ఉంది" అని మాత్రమే వ్యాఖ్యానించారు. మూడు దశాబ్దాలుగా ఇన్వెస్టర్లు, ఇన్ఫీ షేర్ హోల్డర్ల పెట్టుబడులను ఇబ్బడిముబ్బడిగా పెంచుతూ, వారందరి మదినీ దోచిన నారాయణమూర్తికి ప్రస్తుత సీఈఓ విశాల్ శిక్కా పాదాభివందనం చేస్తే, ఆప్యాయంగా కౌగిలించుకుని ఆశీర్వదించారు. ఈ సందర్భంగా, సంస్థలో డైరెక్టరుగా బాధ్యతలు స్వీకరించాలని అత్యధికులు డిమాండ్ చేశారు. "మూర్తీ... మూర్తీ..." అంటూ షేర్ హోల్డర్లు చేస్తున్న నినాదాలు ఎక్కువ కావడంతో ఒక దశలో కొత్త చైర్మన్ ఆర్ శేషసాయి కల్పించుకుని మైక్ తీసుకోవాల్సి వచ్చింది. "ఆయన మా మార్గదర్శకుడు. మనకందరికీ కూడా... ఆయన ఇటువైపు కూర్చున్నా, అటువైపు కూర్చున్నా, ఆయన మన 'భీష్మ పితామహుడు' అవసరమైన సమయంలో మనకు సహాయం చేసేందుకు, సలహాలు ఇచ్చేందుకు వెనుకాడరు" అని సర్ది చెప్పాల్సి వచ్చింది. కాగా, తన భార్య సుధా మూర్తి, కుమారుడు రోహన్ లతో కలసి వచ్చిన ఆయన సమావేశం ముగిసేంతవరకూ వేచి వున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ, విశాల్ శిక్కా చాలా కష్టించి కృషి చేస్తారని, 2020 నాటికి సంస్థను ముందు తీసుకెళ్లే లక్ష్యాలను చేరుకునేందుకు ప్రణాళికలు వేస్తున్నారని అన్నారు. బోర్డు డైరెక్టర్లుగా మరో వ్యక్తి అవసరం ఉందని తాను భావించడం లేదని తెలిపారు.

  • Loading...

More Telugu News