: కోల్ కతాలో చేపల కోసం ఆసుపత్రి... ఏపీని దాటేందుకేనట!
ఇండియాలో అత్యధిక మత్స్య సంపద ఏ రాష్ట్రంలో చేతికందుతుంది? ఈ ప్రశ్నకు 2011-12 వరకూ ఒకటే సమాధానం ఉండేది. అదే పశ్చిమ బెంగాల్. కానీ, ఆ తరువాత జవాబు మారిపోయింది. ఆంధ్రప్రదేశ్ రాష్టంలోని తీరప్రాంతాల్లో మత్స్య సంపద పెరగడంతో అత్యధికంగా చేపలు పడుతున్న రాష్ట్రంగా నిలిచింది. పరిస్థితులను తిరిగి తమకు అనుకూలంగా మార్చుకునే యత్నాల్లో భాగంగా, ఇండియాలోనే ప్రప్రథమంగా చేపల కోసం ఓ ఆసుపత్రి కోల్ కతాలో ప్రారంభం కానుంది. చేపలకు వచ్చే వ్యాధులను గుర్తించి, వాటిని నయం చేయడం, పునరుత్పత్తి సమయంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా, మత్స్య దిగుబడి పెంచడం వంటి చర్యల ద్వారా తిరిగి ఆంధ్రప్రదేశ్ ను అధిగమించాలని బెంగాల్ సర్కారు భావిస్తోంది. మరో రెండు నెలల్లో అందుబాటులోకి రానున్న ఆసుపత్రి భవన నిర్మాణం ఇప్పటికే పూర్తయిందని, విద్యుత్ సరఫరా పనులు జరుగుతున్నాయని అధికారులు తెలిపారు. జాతీయ మత్స్య సంపదలో 60 నుంచి 65 శాతం దిగుబడి చేపలకు వచ్చే రోగాల కారణంగానే తగ్గుతున్న తరుణంలో ఈ ఆసుపత్రి సేవలు ఉపయుక్తం అవుతాయని నిపుణులు భావిస్తున్నారు.