: విమాన ప్రమాదంలో 'టైటానిక్', 'అవతార్' చిత్రాల సంగీత దర్శకుడి దుర్మరణం
20వ శతాబ్దపు మేటి చిత్రం 'టైటానిక్'కి సంగీత దర్శకత్వం వహించి రెండు ఆస్కార్ అవార్డులు గెలుపొందిన జేమ్స్ హోర్నర్ ఘోర విమాన ప్రమాదంలో మరణించారు. శాంటా బార్బారాకు సుమారు 60 మైళ్ల దూరంలో హోర్నర్ ప్రయాణం చేస్తున్న సొంత విమానం కూలిపోయిందని అధికారులు తెలిపారు. తన సొంత అవసరాల నిమిత్తం కొనుగోలు చేసిన చిన్న విమానమే ఆయన ప్రాణాలను తీసింది. హోర్నర్ మరణంతో ఓ అద్భుత వ్యక్తిని కోల్పోయామని ఆయన అసిస్టెంట్ సిల్వియా ఫేస్ బుక్ లో వ్యాఖ్యానించారు. కాగా, హోర్నర్ టైటానిక్ తరువాత అవతార్, బ్రేవ్ హార్ట్, ఏ బ్యూటిఫుల్ మైండ్ తదితర సూపర్ హిట్ చిత్రాలకు సంగీతం అందించారు.