: అటార్నీ జనరల్ సలహాలు ఇరు రాష్ట్రాల మధ్య వివాదాలు మరింత పెంచేలా ఉన్నాయి: ఎంపీ గుత్తా
ఓటుకు నోటు కేసు నేపథ్యంలో, హైదరాబాదులో సెక్షన్-8 విధింపు అంశం శరవేగంగా తెర మీదకు వచ్చింది. ఈ క్రమంలో హైదరాబాదులో సెక్షన్-8 విధించవచ్చంటూ గవర్నర్ నరసింహన్ కు కేంద్ర ప్రభుత్వ అటార్నీ జనరల్ స్పష్టం చేశారు. దీనిపై తెలంగాణ సీనియర్ నేత, ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి అసహనం వ్యక్తం చేశారు. అటార్నీ జనరల్ సూచనలు రెండు తెలుగు రాష్ట్రాల మధ్య విభేదాలను మరింత పెంచే విధంగా ఉన్నాయని అభిప్రాయపడ్డారు. ఆయన సూచనలు అర్థవంతంగా లేవని, పిచ్చితనంతో కూడినట్టు ఉన్నాయని అన్నారు. ఓటుకు నోటు కేసుతో గవర్నర్ కు ఎలాంటి సంబంధం లేదని... గవర్నర్ ఏమి చేస్తారని ప్రశ్నించారు. చంద్రబాబు, కేసీఆర్ ల మధ్య ఒప్పందం కుదిరిందని తాను భావించడం లేదని... అదే నిజమైతే వీరిద్దరికీ జనాలు మంగళం పాడుతారని అన్నారు.