: 48 లక్షల మంది ఉద్యోగులకు కేంద్రం హెచ్చరిక, ఎందుకంటే...!
ప్రభుత్వ ఉద్యోగులు, అందునా సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీలు... ఆఫీసులకు టైముకు వచ్చి, తమ పని తాము చూసుకుపోతారా?... లేక విధుల్లో అలసత్వాన్ని ప్రదర్శిస్తూ, సమయపాలన పాటించకుండా ఇష్టానుసారం వ్యవహరిస్తారా? అన్న విషయంపై కేంద్రం దృష్టి సారించింది. దేశవ్యాప్తంగా వివిధ ప్రభుత్వ సంస్థల్లో పనిచేస్తున్న 48 లక్షల మందికి హెచ్చరికలు జారీ చేసింది. ఈ మేరకు డీఓపీటీ (డిపార్ట్ మెంట్ ఆఫ్ పర్సనల్స్ అండ్ ట్రైనింగ్) విభాగం, అన్ని మంత్రిత్వ శాఖలకూ సమయపాలనపై లేఖలు రాసింది. నిబంధనలను అతిక్రమించేవారిపై క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. "ఆలస్యంగా రావడాన్ని అలవాటు చేసుకున్న ప్రభుత్వ ఉద్యోగిపై క్రమశిక్షణా చర్యలు తీసుకోవచ్చు. అన్ని స్థాయిల్లోని ఉద్యోగులూ తమ అటెండెన్సు విషయంలో జాగ్రత్తగా ఉండాలి. లేకుంటే చర్యలు తప్పవు" అని హెచ్చరించింది. సర్వీస్ రూల్స్ తప్పనిసరిగా అమలు చేయాలని సూచించింది. ఉద్యోగుల ఆధార్ కార్డు ఆధారిత బయో మెట్రిక్ అటెండెన్స్ సిస్టమ్ ను అన్ని కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల్లో అమలు చేయాలని ఆదేశించింది.