: దాయాదులపై ప్రతాపం చూపుతున్న ఉగ్ర భానుడు... కరాచీలోనే 400 మంది మృతి!
పది రోజుల క్రితం వరకూ తెలుగు రాష్ట్రాలతో పాటు ఉత్తరాదిని గడగడలాడించిన ఉగ్ర భానుడు ఇప్పుడు దాయాది దేశం పాకిస్థాన్ పై దృష్టిని పెట్టినట్టున్నాడు. పాకిస్థాన్ లో ఎండల ధాటికి తాళలేక వందలాది మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఒక్క కరాచీ పరిధిలోనే 400 మంది మరణించినట్టు తెలుస్తోంది. వీరిలో చిన్నారులు, మహిళలు అత్యధికంగా ఉన్నట్టు సమాచారం. దాదాపు దశాబ్దం తరువాత పాక్ లో ఇంత అధిక ఉష్ణోగ్రత నమోదు కావడం ఇదే తొలిసారి. ఒకవైపు రంజాన్ సీజన్ మొదలు కావడం, మరోవైపు ఎండ వేడిమితో, మంచినీరు కూడా తాగకుండా కఠిన ఉపవాసాలు ఉండలేక అల్లాడిపోతున్నారు. సదరన్ సింధ్ ప్రావిన్స్ ప్రాంతంలోని ఆసుప్రతుల్లో ఎమర్జన్సీ కేసుల చేరిక పెరుగుతోందని తెలుస్తోంది. బాధితులకు సహాయం చేసేందుకు పాక్ సైన్యం రంగంలోకి దిగింది. ఎండ వేడిమితో ఆరోగ్యవంతుల్లో సైతం రక్తపోటు గణనీయంగా పడిపోతోందని, అందువల్ల మృతుల సంఖ్య అధికంగా ఉందని వైద్యులు చెబుతున్నారు.