: ఒకరిని ఇంటికి పంపితే, మిగతావారు దారికొస్తారు... గ్రేటర్ పై హైకోర్టు ఆగ్రహం


జీహెచ్ఎంసీ (గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్) అధికారుల వైఖరిపై హైకోర్టు మరోసారి మండిపడింది. ఎన్నిసార్లు తాము కల్పించుకున్నా తీరు మారడం లేదని, పై అధికారి ఒకరిని ఇంటికి పంపితే, మిగతావారు దారికొస్తారని వ్యాఖ్యానించింది. ఆక్రమణదారులకు ఇచ్చిన నోటీసులు చాలా అస్పష్టంగా ఉన్నాయని అభిప్రాయపడ్డ హైకోర్టు, అధికారులు తమ ఉత్తర్వులను తేలికగా తీసుకున్నట్టు తెలుస్తోందని ఆగ్రహం వ్యక్తం చేసింది. నోటీసుల్లో కోర్టు ఆదేశాల మేరకు అన్న పదాన్ని వాడటంపై అభ్యంతరం చెబుతూ, "మేం చెబితే గానీ మీరు ఏ పనీ చేయరా..? ఆక్రమణదారులకు నోటీసులు ఇవ్వాలని కూడా మేమే చెప్పాలా? మీ పని మేం చేయాలా? మేం చెబితేనే మీరు నెల నెలా జీతాలు తీసుకుంటున్నారా?" అని తీవ్ర అసహనాన్ని వ్యక్తం చేసింది. హైదరాబాదులోని ఫుట్ పాత్ ల ఆక్రమణదారులపై జీహెచ్ఎంసీ చర్యలు తీసుకోవడం లేదని దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యంపై విచారణ సందర్భంగా, తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది. జీహెచ్ఎంసీ అధికారులు చాలా తెలివిగా, ఆక్రమణదారులకు సాయం చేసేందుకే ఇలా నోటీసులను అస్పష్టంగా ఇచ్చారని అభిప్రాయపడింది.

  • Loading...

More Telugu News