: 'కార్డు'లు వాడండి, రాయితీలు పొందండి!
దేశంలో నల్లధనాన్ని అరికట్టేందుకు, పన్ను ఎగవేతలకు చెక్ పెట్టేందుకు కేంద్రం కీలక నిర్ణయాలు తీసుకోనుంది. ఇందులో భాగంగా క్రెడిట్, డెబిట్ కార్డుల ద్వారా లావాదేవీలు జరిపేవారికి పన్ను రాయితీలు దగ్గర చేయాలని భావిస్తోంది. ఐటీ శాఖ అధికారులతో 31వ వార్షిక పీఆర్ సదస్సులో ఆర్థికమంత్రి జైట్లీ ఈ మేరకు పలు కీలక నిర్ణయాలపై ప్రతిపాదనలు చేశారు. వీటిపై ఈ నెల 29లోగా ప్రజలు, పారిశ్రామిక సంఘాల అనుమతి కోరారు. పెట్రోలు, గ్యాస్, రైలు టిక్కెట్లు తదితరాలను ప్లాస్టిక్ మనీ వాడుతూ లావాదేవీలు జరిపితే వాటిపై ట్రాన్సాక్షన్ చార్జీలను తొలగించాలని జైట్లీ ప్రతిపాదించారు. ఇదే సమయంలో లక్ష రూపాయలకు మించిన ఏ లావాదేవీ అయినా ఎలక్ట్రానిక్ విధానంలోనే జరగాలని ఆయన సూచించారు. డెబిట్, క్రెడిట్ కార్డుల ద్వారా మరిన్ని లావాదేవీలను షాపుల యజమానులు స్వీకరించేలా వారికి కూడా పన్ను రాయితీలు దగ్గర చేయాలని ప్రతిపాదించారు. వ్యక్తిగత లావాదేవీలపై వివరాలుంటే, నల్లధనాన్ని మరింత తేలికగా కట్టడి చేయవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు.