: ‘ఓటుకు నోటు’ టీ ఏసీబీకి ఆర్థిక భారమే!...15 రోజుల్లో రూ.37 లక్షల అదనపు నిధులు
తెలుగు రాష్ట్రాల మధ్య ఆరని చిచ్చును రగిల్చిన ఓటుకు నోటు కేసు తెలంగాణ ఏసీబీకి పెను భారంగానే మారిందట. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాగంగా తెలంగాణ నామినేటెడ్ ఎమ్మెల్యే ఎల్విస్ స్టీఫెన్ సన్ ఓటును కొనుగోలు చేసే క్రమంలో టీ టీడీఎల్పీ ఉపనేత రేవంత్ రెడ్డి అడ్డంగా దొరికిపోయారు. రేవంత్ రెడ్డితో పాటు మరో ఇద్దరు నిందితుల అరెస్ట్, కేసు దర్యాప్తు, సాక్ష్యాల కోసం వెచ్చించిన మొత్తం, కోర్టులో జరుగుతున్న విచారణ తదితరాలు తెలంగాణ ఏసీబీని ఆర్థిక చిక్కుల్లో పడేసిందన్న వాదన వినిపిస్తోంది. సాధారణ ఖర్చులు ఇబ్బడిముబ్బడిగా పెరిగిపోయిన నేపథ్యంలో నిర్దేశిత కేటాయింపులకు అదనంగా నిధులు మంజూరు చేయాలని ఏసీబీ ప్రభుత్వాన్ని కోరింది. ఈ మేరకు ఏసీబీ అభ్యర్థనకు సానుకూలంగా స్పందించిన ప్రభుత్వం కేవలం 15 రోజుల వ్యవధిలో రూ.37 లక్షలను విడుదల చేసింది. రెండు విడతలుగా విడుదలైన ఈ నిధుల్లో ఈ నెల 6న రూ.12 లక్షలు విడుదల కాగా, నిన్న రూ.25 లక్షలను ఏసీబీకి మంజూరు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.