: మందుబాబు వీరంగం...అక్కాచెల్లెళ్లతో కలిసి కానిస్టేబుల్ పై దాడి, రక్షక్ వాహనం ధ్వంసం


విశాఖ జిల్లా తగరపువలసలో నిన్న రాత్రి చోటుచేసుకున్న ఓ ఘటన తాగుబోతు వీరంగానికి పరాకాష్ఠగా నిలిచింది. డ్రంకన్ డ్రైవ్ లో భాగంగా బ్రీత్ ఎనలైజర్ పరీక్షకు నిరాకరించిన యువకుడు ఆ తర్వాత తన అక్కాచెల్లెళ్లు, బంధువులతో కలిసి ట్రాఫిక్ కానిస్టేబుల్ పై మూకుమ్మడి దాడికి దిగడమే కాక, పోలీస్ ఔట్ పోస్టుపై విరుచుకుపడ్డాడు. పోలీసులకు చెందిన రక్షక్ వాహనాన్ని ధ్వంసం చేశాడు. ఈ ఘటనలో యువకుడి అక్కాచెల్లెళ్లు బాధిత కానిస్టేబుల్ పై విరుచుకుపడటమే కాక, రక్షక్ వాహనంపై ఎక్కి నానా బీభత్సం సృష్టించారు. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని యువకుడితో పాటు శివమెత్తిన అతడి అక్కాచెల్లెళ్లను కూడా అదుపులోకి తీసుకున్నారు. వివరాల్లోకి వెళితే... నిన్న రాత్రి పొద్దుపోయిన తర్వాత డ్రంకన్ డ్రైవ్ లో భాగంగా పోలీసులు మందుబాబులను తనిఖీ చేస్తున్నారు. ఈ క్రమంలో తగరపువలసకు చెందిన వ్యాపారి రవి వాహనాన్ని నిలిపేసిన ఓ ట్రాఫిక్ కానిస్టేబుల్ అతడికి బ్రీత్ ఎనలైజర్ పరీక్ష చేసేందుకు సిద్ధమయ్యాడు. పరీక్షకు రవి నిరాకరించాడు. ఈ క్రమంలో ఇరువురి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఆ తర్వాత బంధువర్గంతో కలిసి పోలీస్ ఔట్ పోస్టుపై రవి దాడి చేశాడు. తనకు పరీక్ష చేయబోయిన కానిస్టేబుల్ పై చేయి చేసుకున్నాడు. ఈ సందర్భంగా అతడి అక్కాచెల్లెళ్లు కూడా కానిస్టేబుల్ పై చేయి చేసుకోవడమే కాక తిట్ల దండకం అందుకున్నారు. అనంతరం బయటకు వచ్చి రక్షక్ వాహనంలో అక్కడి నుంచి వెళ్లేందుకు సిద్ధమైన కానిస్టేబుల్ పై మరోమారు దాడి చేశారు. కారులో కూర్చున్న కానిస్టేబుల్ ను ఈడ్చి మరీ కొట్టారు. ఆ తర్వాత బానెట్ పైకి ఎక్కిన రవి సోదరి వీరంగం సృష్టించింది. ప్రస్తుతం దాడి చేసిన రవి, అతడి అక్కాచెల్లెళ్లను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

  • Loading...

More Telugu News