: తెలుగు నేల రైతుగా మాస్టర్ బ్లాస్టర్...నెల్లూరు జిల్లాలో రెండెకరాల పొలాన్ని కొనుగోలు చేసిన సచిన్!


క్రికెట్ లో మాస్టర్ బ్లాస్టర్ గా పేరుగాంచిన భారతరత్న సచిన్ టెండూల్కర్ ఆ తర్వాత రాజ్యసభ సభ్యుడిగా దేశ చట్టసభలో కాలుమోపాడు. తాజాగా సచిన్ రైతుగానూ మారిపోయాడు. అది కూడా తెలుగు నేలలోని నెల్లూరు జిల్లాలో! జిల్లాలోని తడ మండలం కాదలూరు గ్రామ పరిధిలో రెండెకరాల వ్యవసాయ భూమిని సచిన్ కొనుగోలు చేశాడు. 2006లోనే ఈ భూమిని సచిన్ కొన్నట్లు వార్తలు వినిపించినా, నాడు దీనిపై ఎవరూ నోరు విప్పలేదు. తాజాగా సదరు భూమికి పట్టాదారు పాస్ బుక్కులు జారీ చేయాలని అతడు తడ తహశీల్దార్ కు దరఖాస్తు చేసుకున్నాడు. గ్రామ పరిధిలోని సర్వే నెం.263/2(బీ)లో మునికృష్ణయ్య అనే రైతుకు రెండెకరాల భూమి ఉంది. ఈ భూమిని కొనుగోలు చేసిన సచిన్, ఆ భూమికి సంబంధించి తన పేరిట పాస్ బుక్కు జారీ చేయమని అర్జీ పెట్టుకున్నాడు. అర్జీని పరిశీలించిన రెవెన్యూ అధికారులు సదరు భూమి సచిన్ దేనని నిర్ధారించారు. దీంతో సచిన్ పేరిట సదరు భూమికి పట్టా నెంబరు 456, పట్టాదారు పాస్ పుస్తకం నెంబరు 09వై 46ఎస్ 005000008 పేరిట ఆన్ లైన్ పాస్ పుస్తకం జారీ అయ్యింది. పట్టాదారు పాస్ పుస్తకం ముద్రణ పూర్తి కాగానే దానిని సచిన్ కు అందజేయనున్నట్లు తడ తహశీల్దార్ ఏడుకొండలు తెలిపారు. ఇదిలా ఉంటే, తడ మండలంలోనే సచిన్ కుటుంబ సభ్యుల పేరిట మరో పదెకరాల వ్యవసాయ భూమి ఉన్నట్లు తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించిన వివరాలు తెలియరాలేదు.

  • Loading...

More Telugu News