: ధోనీ మాటలను సీరియస్ గా తీసుకోవాల్సిన పనిలేదు: గంగూలీ
టీమిండియాకు మేలు జరుగుతుందని భావిస్తే కెప్టెన్సీ నుంచి సంతోషంగా తప్పుకుంటానని ఎంఎస్ ధోనీ అనడంపై మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ స్పందించాడు. బంగ్లాదేశ్ చేతిలో దారుణ పరాభవం ఎదురుకావడంతో ధోనీ నిరుత్సాహానికి గురై ఉంటాడని, ఆ క్రమంలోనే కెప్టెన్సీ నుంచి తప్పుకుంటానని వ్యాఖ్యానించి ఉంటాడని గంగూలీ అభిప్రాయపడ్డాడు. ధోనీ మాటలను తీవ్రంగా పరిగణించాల్సిన అవసరం లేదని, ఈ వ్యవహారాన్ని ఇంతటితో వదిలేయాలని సూచించాడు. ధోనీ భారత క్రికెట్ కు అందించిన సేవలు, సాధించిన ఘనతలను దృష్టిలో ఉంచుకుని అతడిని గౌరవించాలని అన్నాడు. ఇక, 2016 టి20 వరల్డ్ కప్ దాకా ధోనీనే కెప్టెన్ గా ఉండాలని భావిస్తున్నారా? అని మీడియా ప్రతినిధి అడిగిన ప్రశ్నకు బదులిస్తూ... ఇది ఏ ఒక్కరో తీసుకోవాల్సిన నిర్ణయం కాదని, ముందు బంగ్లాదేశ్ తో సిరీస్ ముగియాలని, ఇలాంటి నిర్ణయాన్ని రాత్రికి రాత్రే తీసుకోలేమని అన్నాడు.