: ఈ 'రాము'డు రావణ భక్తుడు!
లంకాధీశుడు రావణుడిని హతమార్చింది శ్రీరాముడు. వీరి నడుమ వైరం తెలిసిందే. అలాంటప్పుడు రావణుడిపై రాముడి భక్తికి ఆస్కారమేలేదు. కానీ, ఈ పంజాబ్ 'రాము'డు మాత్రం దశకంఠుడికి వీరభక్తుడు. లూథియానాలోని తల్వాండీ కలాన్ ప్రాంతానికి చెందిన రామ్ చంద్ (70) అనే వ్యక్తి రావణుడిని ఆరాధించడం ద్వారా వార్తల్లోకెక్కారు. ఎంత భక్తి అంటే తన భూమిని రావణ ఆలయ నిర్మాణం కోసం లూథియానాలోని మహాత్మా రావణ్ జ్ఞాన్ పీఠ్ కు విరాళంగా ఇచ్చేశాడు. దాంతో, ఫిల్లౌర్ జిల్లాలోని పంజ్దేరా గ్రామంలో త్వరలో మహాత్మా రావణ్ మందిర్ నిర్మాణం జరుపుకోనుంది. ఆసక్తికర విషయం ఏమిటంటే... అందరూ దసరా సందర్భంగా రావణ దహనం చేస్తుంటే, ఈయన మాత్రం రావణుడి కోసం 'శోక సభ' నిర్వహిస్తారు. రావణుడిపై ఇంత భక్తి ఏమిటని ప్రశ్నిస్తే... రావణుడు యుక్తిపరుడని, కుటుంబం కోసం ఏమైనా చేసే వ్యక్తి అని తెలిపారు. సోదరికి అవమానం జరిగితే, ప్రతీకారం కోసం రగిలిపోయాడని వివరించారు.