: యోగాకు రెండు ప్రపంచ రికార్డులు


అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఢిల్లీలోని రాజ్ పథ్ వద్ద నిర్వహించిన కార్యక్రమానికి విశిష్ట గౌరవం దక్కింది. ఒకే వేదికపై నుంచి అత్యధిక మంది యోగాసనాలు వేయడంతో పాటు, ఒకేచోట అత్యధిక దేశాలకు చెందిన ప్రతినిధులు యోగాసనాలు ఆచరించినందుకు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ రెండు పురస్కారాలు అందజేసింది. ఢిల్లీలోని రాజ్ పథ్ లో ఒకే వేదికపై ప్రధాని, కేంద్ర మంత్రులు, పలు దేశాల ప్రతినిధులతో కలిపి సుమారు 35,985 మంది యోగాసనాలు ఆచరించారు. అత్యధికులు ఒకే వేదికపై యోగాసనాలు వేయడంతో ఇది గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో చోటు సంపాదించుకుంది. అలాగే 84 దేశాలకు చెందిన ప్రతినిధులు ఈ యోగా కార్యక్రమంలో పాలుపంచుకున్నారు. ఒకే వేదికపై అత్యధిక దేశాలకు చెందిన వ్యక్తులు యోగాసనాలు ఆచరించిన రికార్డును కూడా గిన్నిస్ ప్రతినిధులు కట్టబెట్టారు. యోగాకు రెండు ప్రపంచ రికార్డులు దక్కడం పట్ల ఆయుష్ మంత్రిత్వ శాఖ మంత్రి శ్రీపాద్ నాయక్ హర్షం వ్యక్తం చేశారు. కాగా, 2005లో గ్వాలియర్ వివేకానంద కేంద్రం ఆధ్వర్యంలో 29,973 మంది విద్యార్థులు యోగాసనాలు వేసి గిన్నిస్ రికార్డు సృష్టించారు. వారి రికార్డును రాజ్ పథ్ వద్ద జరిగిన యోగా కార్యక్రమం బద్దలు కొట్టింది. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా నిర్వహించిన ఈ కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం చేసేందుకు దూరదర్శన్ 24 అత్యాధునిక కెమెరాలు, 200 మంది సాంకేతిక నిపుణులను వినియోగించింది.

  • Loading...

More Telugu News