: సచిన్ వీరాభిమాని సుధీర్ కు బంగ్లాదేశ్ లో చేదు అనుభవం


భారత క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ కు వీరాభిమానిగా పేరుగాంచిన సుధీర్ గౌతమ్ కు బంగ్లాదేశ్ లో చేదు అనుభవం ఎదురైంది. శరీరానికి త్రివర్ణ పతాకం తాలూకు రంగులను పెయింట్ చేసుకుని, టీమిండియా ఎక్కడ మ్యాచ్ ఆడుతుంటే అక్కడ హుషారుగా కనిపించే ఈ బక్క పలుచని వ్యక్తిపై ఆదివారం బంగ్లాదేశ్ అభిమానులు దాడికి దిగారు. మిర్పూర్ లో రెండో వన్డే ముగిసిన తర్వాత సుధీర్ షేర్-ఏ-బంగ్లాదేశ్ మైదానం వెలుపలికి వచ్చాడు. అతడిని ఉద్దేశించి బంగ్లా ఫ్యాన్స్ మాటల తూటాలు విసరడంతో ఉద్రిక్తత ఏర్పడింది. దీని గురించి సుధీర్ మీడియాకు తెలిపాడు. "మ్యాచ్ ముగియగానే స్టేడియం వెలుపలికి వచ్చాను. బంగ్లా ఫ్యాన్స్ నన్ను చుట్టుముట్టి నావద్ద ఉన్న త్రివర్ణ పతాకాన్ని లాగడం ప్రారంభించారు. పతాకానికి ఉన్న హ్యాండిల్ ను విరిచేశారు. అక్కడే ఉన్న ఇద్దరు పోలీసులు వచ్చి నన్ను ఆటో వరకు తీసుకెళ్లారు. అయితే, ఆ మూక ఆటోపైనా దాడికి యత్నించింది. రాళ్లు కూడా విసిరారు. అదృష్టవశాత్తూ నాకు ఎలాంటి గాయాలు కాలేదు" అని వివరించాడు.

  • Loading...

More Telugu News