: నేను సీఎం అవుతానన్న వార్తలు అవాస్తవం: బాలకృష్ణ
ఓటుకు నోటు కేసు రకరకాల మలుపులు తిరుగుతున్న నేపథ్యంలో... అనేక వదంతులు కూడా షికార్లు చేశాయి. వాటిలో అతి ముఖ్యమైనది ఏపీ ముఖ్యమంత్రి పదవికి చంద్రబాబు రాజీనామా చేస్తారనే వార్త. తాత్కాలిక ముఖ్యమంత్రిగా నియమితులు అవుతారన్న జాబితాలో వినిపించిన వారి పేర్లలో కేంద్ర మంత్రి అశోక్ గజపతి రాజు, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ, మంత్రులు యనమల, పి.నారాయణల పేర్లతో పాటు నారా లోకేష్ పేరు కూడా ఉంది. ఈ వార్తలపై నేడు బాలకృష్ణ స్పందించారు. తాను సీఎం అవుతాననే వార్తల్లో ఏమాత్రం వాస్తవం లేదని స్పష్టం చేశారు. పార్టీని, ప్రభుత్వాన్ని సమర్థవంతంగా నడిపించే సత్తా చంద్రబాబుకే ఉందని చెప్పారు. అంతేకాకుండా, త్వరలోనే బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రిని ఏపీలో కూడా నెలకొల్పుతామని తెలిపారు.