: కుక్కలు కూడా యోగా చేస్తాయంటూ ఎద్దేవా చేసిన సీతారాం ఏచూరి
ప్రధాని నరేంద్ర మోదీ చొరవతో, ఐక్యరాజ్యసమితి తీర్మానం మేరకు, ప్రపంచవ్యాప్తంగా అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని 170 దేశాలు అధికారికంగా నిర్వహించాయి. ఐరాస ప్రధాన కార్యాలయంలో ప్రధాన కార్యదర్శి బాన్ కీ మూన్ దంపతులు స్వయంగా యోగాసనాలు వేశారు. ఇక మన దేశంలో అయితే, ఎక్కడ చూసినా యోగా సందడే కనపడింది. అన్ని చోట్లా ఓంకార నాదం ప్రతిధ్వనించింది. ఢిల్లీలోని రాజ్ పథ్ లో ప్రధాని మోదీ 21 యోగ ముద్రలు వేయగా... ఆయన సమక్షంలో 36 వేల మంది యోగా చేశారు. అయితే, ఈ యోగా దినోత్సవ నిర్వహణపై సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి మండిపడ్డారు. భారీ సంఖ్యలో జనాలను చేర్చడం కేవలం నియంతలు మాత్రమే చేసే పని అంటూ విమర్శించారు. రాజ్ పథ్ లో పెద్ద ఎత్తున జనం గుమికూడటం నిషేధమయినప్పటికీ... వేల సంఖ్యలో జనాన్ని సమీకరించారని నిరసన వ్యక్తం చేశారు. కుక్కలు కూడా యోగా చేస్తాయని ధ్వజమెత్తారు. కాళ్లు, చేతులు ఆడిస్తూ, దీర్ఘంగా శ్వాస తీసుకుంటాయని, యోగాకు సంబంధించిన అన్ని ఆసనాలను అందులో చూడవచ్చని అన్నారు. కేవలం హిందుత్వ అజెండాను అమలు చేయడంలో భాగంగానే మోదీ యోగా ప్రచారాన్ని అందుకున్నారని ఆరోపించారు.