: పూరీ-గోపాల్ పూర్ మధ్య తీరం దాటిన వాయుగుండం... మత్స్యకారుల కోసం గాలింపు


పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ఒడిశా తీరంలో ఉపరితలాన్ని తాకింది. ఆదివారం మధ్యాహ్నం పూరీ-గోపాల్ పూర్ ప్రాంతాల మధ్య తీరాన్ని దాటింది. దీని ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో మరో 24 గంటల పాటు విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావారణ విభాగం పేర్కొంది. కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు పడతాయని అధికారులు తెలిపారు. తీరం వెంబడి గంటకు 45 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయి. మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని, సముద్రంలో వేటకు వెళ్లరాదని హెచ్చరించారు. అటు, కాకినాడలో 30 ఫిషింగ్ బోట్ల ఆచూకీ తెలియరాలేదు. సముద్రంలో 250 మంది మత్స్యకారులు చిక్కుకున్నట్టు తెలిసింది. వారి కుటుంబ సభ్యులు, బంధువులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మత్స్యకారులను కాపాడేందుకు ఏపీ సర్కారు తీవ్రంగా శ్రమిస్తోంది. ఇందుకోసం ఓఎన్జీసీ, రిలయన్స్ సంస్థల హెలికాప్టర్లతో గాలిస్తున్నామని, చెన్నైకి చెందిన తీర ప్రాంత రక్షక దళం టీములు కూడా సముద్రంలో మత్స్యకారుల ఆచూకీ కోసం వెతుకుతున్నాయని మత్స్యశాఖ డీడీ గోవిందయ్య తెలిపారు. సాంకేతిక లోపంతో బోట్లు సముద్రంలో ఆగిపోయి ఉంటాయని భావిస్తున్నట్టు చెప్పారు. ఇక, తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ అరుణ్ కుమార్ మాట్లాడుతూ... మూడు హెలికాప్టర్లతో గాలిస్తున్నామని, ఈ సాయంత్రానికి బోట్ల ఆచూకీ కనుగొంటామని ధీమా వ్యక్తం చేశారు. మత్స్యకారుల కుటుంబాలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చే ప్రయత్నం చేశారు.

  • Loading...

More Telugu News