: జర్నలిజాన్ని కొత్త పుంతలు తొక్కిస్తున్న డ్రోన్లు
పాకిస్థాన్-ఆఫ్ఘనిస్థాన్ సరిహద్దు ప్రాంతాల్లో దాగిన అల్ ఖైదా టెర్రరిస్టులను తుదముట్టించేందుకు అమెరికా రంగంలోకి దించిన డ్రోన్లు (మానవరహిత విమానాలు) ఇప్పుడు అనేక రంగాల్లో ప్రవేశించాయి. ఇప్పటికే క్రీడా ప్రసారకర్తలు మైదానాల్లో డ్రోన్ కెమెరాలతో కవరేజి ఇస్తుండడం తెలిసిందే. ఈ-కామర్స్ పోర్టళ్లు వస్తువుల డెలివరీకి డ్రోన్లను వినియోగించడంపై ప్రయోగాలు చేస్తున్నాయి. గత కొంతకాలంగా డ్రోన్లు జర్నలిజం రంగాన్ని కూడా కొత్త పుంతలు తొక్కిస్తున్నాయి. క్లిష్ట పరిస్థితుల్లో రిపోర్టింగ్ కు ఆయా వార్తా సంస్థలు డ్రోన్లనే వినియోగిస్తున్నాయి. ఇటీవలే నేపాల్ ను భూకంపం అతలాకుతలం చేయగా, రాజధాని ఖాట్మండూ, పరిసర ప్రాంతాలు దాదాపు నేలమట్టం అయ్యాయి. ఈ సందర్భంగా, శిథిలాల తొలగింపు, మృతదేహాల వెలికితీత, సహాయక కార్యక్రమాలను చిత్రీకరించేందుకు డ్రోన్లను వినియోగించారు. అంతకుముందు, 2012లో ఓ మాంసం శుద్ధి కర్మాగారం పందుల రక్తాన్ని ఓ అండర్ గ్రౌండ్ పైపు ద్వారా డల్లాస్ సమీపంలోని ట్రినిటీ నదిలో డంప్ చేస్తుండడం కలకలం రేపింది. నదిపై మోహరించిన ఓ డ్రోన్ నదిలో రక్తాన్ని గుర్తించడంతో విషయం వెలుగులోకి వచ్చింది. దాంతో, సదరు కంపెనీపై 18 క్రిమినల్ అభియోగాలు మోపారు. దానికి సంబంధించిన విచారణ పెండింగ్ లో ఉంది. ఇక, థాయ్ లాండ్, ఉక్రెయిన్ లో నిరసన ప్రదర్శనలను డ్రోన్ల సాయంతో చిత్రీకరించారు. 2012లో మిడ్ వెస్ట్ దేశాల్లో తలెత్తిన కరవు తీరుతెన్నులను ఈ మానవరహిత విమానాలే కళ్లకు కట్టాయి. నెబ్రాస్కా యూనివర్శిటీ, లింకన్స్ డ్రోన్ జర్నలిజం ల్యాబ్ డ్రోన్ల సాయంతో కరవుకు సంబంధించి ఎంతో సమాచారాన్ని సేకరించాయి. బ్రిటన్లో వర్సెస్టర్ షైర్ ను వరదలు చుట్టుముట్టగా, డీజేఐ ఫాంటమ్ 2 క్వాడ్ కాప్టర్ డ్రోన్ ద్వారా ఆ వరదల తీవ్రతను, పరిధిని తెలుసుకోగలిగారు. వెనౌటు దీవుల్లో ఒకటైన తన్నా ప్రాంతంలోని అగ్నిపర్వతం నిప్పులు కక్కుతుండగా 'ఫాంటమ్' డ్రోన్ దాన్ని చిత్రీకరించి లోకానికి అందించింది. 'ఫాంటమ్' ఆ అగ్నిపర్వతంలోనికి వెళ్లి మరీ ఫుటేజ్ అందించడం విశేషం. ఈ డ్రోన్లకు మరిన్ని సాంకేతిక సొబగులద్దితే పాత్రికేయ ప్రపంచానికి భవిష్యత్తులో మరింతగా సాయపడతాయంటున్నారు నిపుణులు.