: కుక్క అవార్డును పిల్లి కొట్టేసింది!
పిల్లికి 'హీరో డాగ్' అవార్డు లభించింది. లాస్ ఏంజిలెస్ లోని సొసైటీ ఫర్ ద ప్రివెన్షన్ ఆఫ్ క్రుయాలిటీ టు యానిమల్స్ (ఎస్ పీసీఏ) ప్రతిష్ఠాత్మకంగా ఇచ్చే 'హీరో డాగ్' అవార్డును తొలిసారి పిల్లి దక్కించుకుంది. బేరర్స్ ఫీల్డ్ లోని టరా అనే ఆడపిల్లి యజమానురాలి సమక్షంలో ఆమె కుమారుడు జార్జ్ (5) సైకిల్ పై ఆడుకుంటుండగా, అటుగా వచ్చిన కుక్క పిల్లాడి పిక్క (కాలు) పట్టుకుంది. పిల్లాడ్ని లాక్కెళ్లేందుకు ప్రయత్నిస్తుండగా, యజమానురాలు స్పందించేలోపు రంగంలోకి దూకిన టరా ఆకారంలో తనకంటే పెద్దదయిన కుక్కతో తలపడింది. ఇంతలో బాలుడి తల్లి స్పందించి పిల్లాడ్ని చంకనెత్తుకుంది. కుక్కతో టరా పోరాట దృశ్యాలు సెక్యూరిటీ కెమేరాలో నిక్షిప్తమయ్యాయి. పిల్లి ధైర్యానికి ముచ్చటపడిన ఇంటి యజమాని దానిని సోషల్ మీడియాలో అప్ లోడ్ చేయగా, దానికి విశేషమైన ఆదరణ లభించింది. ఈ వీడియోను సుమారు 2.4 కోట్ల మంది వీక్షించారు. దీంతో టరాకు 'హీరో డాగ్' అవార్డు ఇవ్వాలని కమిటీ నిర్ణయించింది. చరిత్రలో తొలిసారి కుక్క అవార్డును పిల్లి కొట్టేసింది.