: 'ఓటుకు నోటు' వ్యవహారంలో స్టీఫెన్ సన్ పూర్తి వాంగ్మూలమిదే!


ఓటుకు నోటు వ్యవహారంలో రేవంత్ రెడ్డిని రెడ్ హ్యాండెడ్ గా పట్టించిన ఆంగ్లో ఇండియన్, నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్ సన్ న్యాయమూర్తి ఎదుట వాంగ్మూలమిచ్చారు. వాంగ్మూలంలోని ముఖ్యాంశాలు..."మే 28న ఉదయం 9 గంటలకు మాథ్యూస్ జెరూసలెం (మత్తయ్య) నాకు ఫోన్ చేసి, 30వ తేదీన జరిగే కార్యక్రమంలో పాల్గొనాలని ఆహ్వానించారు. నేను బిజీగా ఉండడంతో 11 గంటలకు ఏదో ఒక విషయం చెబుతానని చెప్పాను. అయితే 10 గంటలకే మత్తయ్య హైదరాబాదులోని బోయిగూడలో ఉన్న మా నివాసానికి వచ్చారు. ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి సూచనలతో వచ్చినట్టు ఆయన వెల్లడించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో పాల్గోకుండా ఉంటే 2 కోట్ల రూపాయలు ఇస్తామని చెప్పారు. నేను స్పందించకపోవడంతో ఆయన వెళ్లిపోయారు. గంటన్నర తరువాత ఆంథోనీ వచ్చారు. తన వెంట తీసుకొచ్చిన వ్యక్తిని సెబాస్టియన్ అని, తన స్నేహితుడని పరిచయం చేశారు. ఆయన వెళ్లిపోయిన తరువాత సెబాస్టియన్ మాట్లాడుతూ, ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటేయకుండా వుంటే... రెండు కోట్ల రూపాయలు, కుటుంబ సమేతంగా జెరూసలెం వెళ్లేందుకు విమాన టికెట్లు అందజేస్తామని ఆఫర్ ఇచ్చారు. అదే నేరుగా టీడీపీ అభ్యర్థి వి.రాఘవేందర్ రెడ్డికి (పేరు తప్పుగా చెప్పారు...టీడీపీ అభ్యర్థి వేం నరేందర్ రెడ్డి) ఓటేస్తే 5 కోట్ల రూపాయలు ఇస్తామని ప్రలోభపెట్టారు. అయితే లంచం తీసుకుని ఓటు వేయడం అనైతికమని భావించిన నేను మధ్యాహ్నం తెలంగాణ అవినీతి నిరోధక శాఖ డైరెక్టర్ జనరల్ కి లేఖ రాశాను. ఫిర్యాదుపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాల్సిందిగా డీఎస్పీ అశోక్ కుమార్ ను కోరాను. అదే రోజు సాయంత్రం 6 గంటలకు తాజ్ కృష్ణలో కలిసేందుకు అనువైన సమయం చెప్పాలంటూ మత్తయ్య నాకో మెసేజ్ పంపారు. 29న మరోసారి ఏ విషయం చెప్పాల్సిందిగా, ఫైనల్ చేయాల్సిందిగా ఆయన మరోసారి ఎస్ఎంఎస్ పంపారు. అదే రోజు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటింగ్ పై మీ నిర్ణయం ఏంటో చెప్పాలంటూ సెబాస్టియన్ నుంచి వాట్సప్ లో మెసేజ్ వచ్చింది. దీంతో రాత్రి 9 గంటలకు సెబాస్టియన్ కు ఫోన్ చేసి, టీడీపీలో రెస్పాన్సిబుల్ నాయకుడిని మాత్రమే కలుస్తానని చెప్పాను. దీంతో రేపు ఉదయం రేవంత్ రెడ్డితో వస్తానని ఆయన చెప్పారు. మరుసటి రోజు (30న) ఉదయం పదింటికి రేవంత్ రెడ్డితో కలిసి వస్తున్నట్టు ఫోన్ చేయడంతో నేను ఏసీబీ అధికారులను ఆశ్రయించాను. దీంతో వారు వచ్చి మా ఇంటి టీవీ ముందు వీడియో రికార్డర్ అమర్చి వెళ్లారు. రేవంత్ రెడ్డి వచ్చి సోఫాలో కూర్చున్నారు. ఆయన ఎదురుగా నేను సోఫాలో కూర్చున్నాను. చంద్రబాబు పంపితేనే వచ్చామని, చంద్రబాబుతో సమావేశం ఏర్పాటు చేస్తామని, అది అత్యంత రహస్యంగా ఉంటుందని రేవంత్ చెప్పారు. రెండున్నర కోట్ల రూపాయల ఆఫర్ సరిపోకపోతే, ఎంత కావాలో చెప్పాలని, డబ్బుల సంగతి చూసేది చంద్రబాబేనని రేవంత్ తెలిపారు. దీంతో ఐదు కోట్లు కావాలని యథాలాపంగా చెప్పాను. బాబుతో మాట్లాడి డీల్ కన్ ఫర్మ్ చేస్తామని రేవంత్ చెప్పారు. మరుసటి రోజు రెండు సార్లు ఫోన్ చేసిన సెబాస్టియన్ బాబు బిజీగా ఉన్నారని, ఫ్రీ అయ్యాక ఫోన్ మాట్లాడుతారని అన్నారు. తరువాత 'బాబుతో మాట్లాడండి' అంటూ ఫోన్ ఇచ్చారు. ఫోన్ లో బాబు మాట్లాడుతూ, మా వాళ్లు అంతా బ్రీఫింగ్ చేశారని...స్వేచ్ఛగా నిర్ణయం తీసుకోవాలని, భయమేమీ అక్కర్లేదని బాబు తెలిపారు. తద్వారా 5 కోట్లు అందజేస్తామని, జాగ్రత్తగా చూసుకుంటామని బాబు అన్నారు. మరుసటి రోజు (31న) ఉదయం 8:30 ప్రాంతంలో సెబాస్టియన్ ఫోన్ చేసి అడ్వాన్స్ తీసుకుని రేవంత్ రెడ్డితో వస్తున్నట్టు తెలిపారు. 3:20 గంటల ప్రాంతంలో ఫోన్ చేసి వేరే చోట కలుసుకుందామని చెప్పారు. దీంతో మా స్నేహితుడు టేలర్ ఇంట్లో కలుసుకుందామని చెప్పాను. తరువాత వెన్యూను టేలర్ తల్లి ఇంటికి మార్చి, ఏసీబీ అధికారులకు సమాచారం అందించాను. 4:20 ప్రాంతంలో రేవంత్ రెడ్డి, సెబాస్టియన్ తో పాటు వచ్చి నా ఎదురుగా సోఫాలో కూర్చున్నారు. తరువాత 5.8 అడుగుల పొడవు ఉండే ఓ వ్యక్తి వచ్చి 500 రూపాయల డినామినేషన్ తో 2.5 లక్షల రూపాయల మొత్తంతో కూడిన 20 బండిళ్ల నోట్ల కట్టలు కలిగిన బ్యాగును (50 లక్షల మొత్తం) తెచ్చి టీపాయ్ పై పెట్టి అందజేశారు. అనంతరం రేవంత్ రెడ్డి తాను బిజీగా ఉన్నానని లేచేందుకు సిద్ధమవ్వగా, ఏసీబీ అధికారులు వచ్చి... రేవంత్ రెడ్డి, సెబాస్టియన్ లతో బాటు డబ్బులు అందించిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం ఫోన్ చేసి, విచారణకు హాజరుకావాలంటూ ఏసీబీ అధికారులు కోరడంతో వెళ్లి వాంగ్మూలమిచ్చాను. ఈ మొత్తం వ్యవహారాన్ని ఆడియో, వీడియోను ఏసీబీ అధికారులు రికార్డు చేశారు".

  • Loading...

More Telugu News