: అంతా సద్దుమణుగుతున్నప్పుడు నోటీసులెందుకిచ్చారు?: బాబు ఆరా


ఓటుకు నోటు, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం సద్దుమణుగుతున్న దశలో టీ న్యూస్, సాక్షి ఛానెల్ కు నోటీసులు ఎందుకిచ్చారని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అధికారులను అడిగినట్టు సమాచారం. గత రెండు రోజులుగా రెండు రాష్ట్రాల్లో నెలకొన్న వివాదాస్పద పరిస్థితులు చల్లబడ్డట్టు కనబడ్డాయి. ఈ దశలో టీ న్యూస్ చానెల్ కు నోటీసులు జారీ చేయడంతో తెలంగాణలో కలకలం రేగుతోంది. హైదరాబాదులో జర్నలిస్టులు ధర్నా చేపట్టారు. ఏపీ సచివాలయం, ఏపీ డీజీపీ కార్యాలయం ఎదుట ఆందోళన నిర్వహించారు. దీంతో వివాదం సద్దుమణుగుతున్న దశలో నోటీసులెందుకివ్వాల్సి వచ్చిందని ఆయన పోలీసులను ఆరాతీశారు. దానికి వారు సమాధానంగా, కేసు నమోదు చేసిన తరువాత కొన్ని పద్ధతులను అనుసరించవలసి వుందని స్పష్టం చేశారు. అందులో భాగంగానే టీ న్యూస్, సాక్షి, టెలీకాం ప్రొవైడర్లకు నోటీసులు జారీ చేసినట్టు తెలిపారు. దీనివల్ల జరిగే నష్టం ఏదీ లేదని, కేసు నమోదు చేసిన తరువాత విచారణ లేకుండా పక్కన పెట్టలేమని, వారు బాబుకు తెలిపినట్టు సమాచారం. కాగా, టెలీకాం ప్రొవైడర్లకు నోటీసులు జారీ చేయడంతో వారు ఆందోళన చెందుతున్నారు. రెండు రాష్ట్రాల మధ్య నెలకొన్న వివాదం, తమ తలకు చుట్టుకుంటుందేమోనని పలువురు భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు.

  • Loading...

More Telugu News