: ఈ వివాదంలో ధోనీ తప్పులేదు: రవిశాస్త్రి
బంగ్లాదేశ్ తో జరిగిన తొలి వన్డేలో ప్రత్యర్థి బౌలర్ ముస్తాఫిజుర్ రెహ్మాన్ ను భారత జట్టు కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ ఢీ కొట్టిన వివాదంలో ధోనీని టీమిండియా డైరెక్టర్ రవిశాస్త్రి వెనుకేసుకొచ్చాడు. ఈ వివాదంలో ధోనీ తప్పేమీ లేదని రవిశాస్త్రి స్పష్టం చేశాడు. ముస్తాఫిజుర్ ను ధోనీ ఉద్దేశపూర్వకంగా ఢీ కొట్టలేదని, వీడియో చూస్తే ఈ విషయం తెలుస్తుందని రవిశాస్త్రి పేర్కొన్నాడు. అయితే వీడియోలను పరిశీలించిన తరువాతే ఉద్దేశపూర్వకంగా ముస్తాఫిజుర్ రెహ్మాన్ ను ఢీ కొట్టాడని పేర్కొంటూ, ఐసీసీ ధోనీ మ్యాచ్ ఫీజులో 75 శాతం జరిమానా విధించిన సంగతి తెలిసిందే. టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మ ఈ వివాదంపై మాట్లాడుతూ, ఆటలో ఇవన్నీ సహజమన్నాడు. మ్యాచ్ లో ఇలాంటి చిన్న చిన్న సంఘటనలు జరుగుతాయని, ఇవి వివాదాలు కాదని రోహిత్ పేర్కొన్నాడు.