: పసుపు రంగు చీర కట్టుకోకపోతే యాసిడ్ పోస్తానన్న ప్రొఫెసర్!
పసుపు రంగు చీర కట్టుకుని కళాశాలకు రాకపోతే యాసిడ్ పోస్తానని బెదిరింపులకు దిగిన అసిస్టెంట్ ఫ్రొఫెసర్ ఘనకార్యం ఢిల్లీలో వెలుగు చూసింది. దేశ రాజధానిలో సెయింట్ స్టీఫెన్స్ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ పై ఈ విషయంలో లైంగిక వేధింపుల కేసు నమోదైంది. ఆ కాలేజీలో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా పని చేస్తున్న సతీష్ కుమార్ పై పీహెచ్ డీ విద్యార్థిని ఫిర్యాదు చేసినట్టు పోలీసులు తెలిపారు. ఏడు పేజీల ఫిర్యాదులో ఆమె అసిస్టెంట్ ప్రొఫెసర్ లైంగిక వేధింపుల పర్వాన్ని వివరించింది. గత రెండేళ్లుగా నిత్యం లైంగిక వేధింపులకు గురిచేస్తున్నాడని ఆమె ఫిర్యాదులో ఆవేదన వ్యక్తం చేసింది. కెమిస్ట్రీ ల్యాబ్ లో లైంగిక వేధింపులకు దిగాడని ఆమె పేర్కొంది. పసుపు రంగు చీర కట్టుకుని రాకపోతే యాసిడ్ పోస్తానని బెదిరించాడని ఆమె పేర్కొంది. కళాశాల ప్రిన్సిపల్ కు ఆయనపై ఫిర్యాదు చేసినప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆమె ఆందోళన వ్యక్తం చేసింది. అతని వేధింపులు భరించలేక పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నట్టు ఆమె స్పష్టం చేసింది. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు, దర్యాప్తు ప్రారంభించారు.