: నరేంద్ర మోదీ యోగా చేస్తారా?: ఆశ్చర్యం వ్యక్తం చేసిన రష్యా అధ్యక్షుడు
భారత ప్రధాని నరేంద్ర మోదీ కూడా యోగా చేస్తారా? అంటూ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. భారత్ లో 'ఆయుష్' పేరుతో నరేంద్ర మోదీ ఒక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేశారన్న వార్తను విన్న అనంతరం పుతిన్ ప్రతిస్పందన ఇది. యోగాతో ఎన్నో ప్రయోజనాలున్నప్పుడు ప్రతి ఒక్కరూ దాన్ని చేయవచ్చు కదా? అని అన్నారు. 'సెయింట్ పీటర్స్ బర్గ్ ఇంటర్నేషనల్ ఎకనమిక్ ఫోరం' రెండో రోజు కార్యక్రమాల సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా వచ్చిన మీడియా ప్రతినిధుల ప్రశ్నలకు బదులిస్తూ... మోదీ చాలా మంచి వ్యక్తి అని, తనకు వ్యక్తిగతంగా మంచి మిత్రుడని తెలిపారు. 'మీరు, మోదీ ఇద్దరు కూడా కఠినమైన నాయకులు కదా?' అన్న ప్రశ్నకు బదులిస్తూ... 'అది కరెక్ట్ కాదు' అన్నారు. తనది కఠినమైన మనస్తత్వం కాదని, సర్దుకుపోయే స్వభావం తనలో ఉందని తెలిపారు.