: సండ్రను విశాఖలో, మత్తయ్యను విజయవాడలో దాచారు: హరీష్ రావు
ఓటుకు నోటు కేసులో టీడీపీ నేతలు తమకు తామే ఇరుక్కున్నారని టీఎస్ మంత్రి హరీష్ రావు అన్నారు. అయినప్పటికీ, తప్పును తప్పు అని తాము అంటుంటే టీడీపీ నేతలు ఎదురుదాడి చేస్తున్నారని మండిపడ్డారు. ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్యను విశాఖపట్నంలో, ఓటుకు నోటు నిందితుడు మత్తయ్యను విజయవాడలో దాచారని ఆరోపించారు. టీన్యూస్ కు నోటీసులివ్వడం ఏపీ ప్రభుత్వ దివాలాకోరుతనానికి నిదర్శనమని అన్నారు. ఏపీలో కేసీఆర్ పై 87 కేసులు పెట్టారని... తెలంగాణ ప్రజలు తలచుకుంటే చంద్రబాబుపై లక్ష కేసులు పెడతారని... అయినా, తాము సంయమనం పాటిస్తున్నామని చెప్పారు. ఏపీ పోలీసులు హైదరాబాదులో ఉండటం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ఆంధ్ర పోలీసుల వ్యవహారంపై గవర్నర్ నరసింహన్ కలగజేసుకోవాలని కోరారు.