: చంద్రబాబు, కేసీఆర్ లకు ఏమీ కాదు... ప్రజలే నష్టపోతారు: జేపీ
ఓటుకు నోటు కేసు రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాల మధ్య యుద్ధ వాతావరణాన్ని సృష్టించింది. రెండు ప్రభుత్వాలు, ఇరువురు ముఖ్యమంత్రులు ఎత్తుకు పైఎత్తులు వేస్తూ... నువ్వు ఒకటి చేస్తే, నేను రెండు చేస్తా అన్నట్టుగా ముందుకు సాగుతున్నారు. ఈ నేపథ్యంలో, ప్రస్తుతం నెలకొన్న ఉద్రిక్త పరిస్థితికి వెంటనే ముగింపు పలకాల్సిన అవసరం ఉందని లోక్ సత్తా జాతీయ అధ్యక్షుడు జయప్రకాశ్ నారాయణ చెప్పారు. ఇంత జరుగుతున్నా కేంద్ర ప్రభుత్వం సమస్యను పరిష్కరించకుండా, నిమ్మకునీరెత్తినట్టు వ్యవహరిస్తోందని మండిపడ్డారు. ఈ ఉద్రిక్తతల వల్ల ముఖ్యమంత్రులు చంద్రబాబు, కేసీఆర్ లకు ఏమీ కాదని... నష్టపోయేది సామాన్య ప్రజలే అని అన్నారు.