: తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల తీరు బాగాలేదు: వెంకయ్యనాయుడు
ఓటు నోటు కేసు, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంతో ఏపీ, తెలంగాణ రాష్ట్రాల నడుమ నెలకొన్న రాజకీయ వివాదంపై కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు తొలిసారి స్పందించారు. ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు వ్యవహరిస్తున్న తీరు బాగాలేదని చంద్రబాబు, కేసీఆర్ ల పేర్లు ప్రస్తావించకుండా అన్నారు. వివాదాలు చట్టానికి వదిలేసి ప్రజల సమస్యలపై దృష్టి పెట్టాలని సూచించారు. రాష్ట్రాల అభివృద్ధిలో పోటీపడాలి తప్ప వివాదాలు పెంచుకోవద్దని హితవు పలికారు. కొందరు మంత్రులు సంయమనం పాటించట్లేదని, గవర్నర్ ను కించపరిచేలా మాట్లాడడం తగదని చెప్పారు. నెల్లూరులో స్వర్ణభారతి ట్రస్టు కార్యక్రమంలో ఈ రోజు వెంకయ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగానే ఆయన పైవిధంగా మాట్లాడారు. గత రెండు వారాల నుంచి తెలుగు రాష్ట్రాల మధ్య వివాదం నడుస్తున్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం చూస్తూ వచ్చింది. ఒకరిపై ఒకరు మాటల దాడి చేసుకోవడం, పోలీసుల కేసులు, నోటీసులతో దూకుడు పెంచడంతో కేంద్రం జోక్యం చేసుకుందని తెలిసింది. ఈ నేపథ్యంలోనే రెండు రోజుల నుంచీ వివాదం కొంత సద్దుమణిగినట్టు కనిపిస్తోంది.