: టీటీడీపీ ఎమ్మెల్యే సండ్ర ఎక్కడ?... చక్కర్లు కొడుతున్న రకరకాల వదంతులు


ఓటుకు నోటు కేసులో టి.ఏసీబీ నుంచి నోటీసులు అందుకున్న టీటీడీపీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య ఎక్కడున్నారనేది ఎవరికీ అంతు చిక్కడం లేదు. ఏసీబీ విచారణకు హాజరుకావడానికి ఆయనకు ఇచ్చిన గడువు నిన్న సాయంత్రంతో ముగిసింది. మరోవైపు, తాను తీవ్రమైన వెన్ను నొప్పితో బాధపడుతున్నానని, ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నానని, కదలకుండా రెస్ట్ తీసుకోవాలని డాక్టర్లు సూచించారని, కావాలంటే ఆసుపత్రికే వచ్చి తన వద్ద నుంచి సమాచారం తీసుకోవచ్చని, విచారణకు పూర్తిగా సహకరిస్తానని ఏసీబీకి నిన్న సండ్ర లేఖ రాశారు. అయితే, ఏ ఊర్లో, ఏ ఆసుప్రత్రిలో ఉన్నారనే విషయాన్ని మాత్రం లేఖలో ఆయన పేర్కొనలేదు. దీంతో, ఆయన ఎక్కడున్నారనేది మిలియన్ డాలర్స్ క్వశ్చన్ గా మిగిలింది. ఏసీబీ ముందు విచారణకు హాజరైతే, ఆ తర్వాత మరింత విచారణ చేయాలంటూ తనను అరెస్ట్ చేసే అవకాశాలున్నాయని సండ్ర భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో, ఆయన న్యాయ నిపుణుల సలహాలు తీసుకుంటున్నట్టు సమాచారం. మరోవైపు, ఆయన ఎక్కడున్నారనే దానిపై ఊహాగానాలు కొనసాగుతున్నాయి. ఆయన విశాఖపట్నంలో ఉన్నారని కొందరు, విజయవాడలో ఉన్నారని కొందరు, విశాఖలో 3 రోజులుండి ఆ తర్వాత విజయవాడకు వచ్చారని... ప్రస్తుతం హైదరాబాదులోనే ఉన్నారని మరికొందరు భావిస్తున్నారు. అయితే, ఆయన ఎక్కడున్నారనే విషయాన్ని పక్కాగా చెబుతున్న వారు మాత్రం లేకపోవడం గమనార్హం.

  • Loading...

More Telugu News