: ‘చేపల వర్షం’పై ఆసక్తికర చర్చ... సాధ్యమేనంటున్న శాస్త్రవేత్తలు!
ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల్లో భాగంగా నిన్న కృష్ణా జిల్లా నందిగామ మండలం గోళ్లమూడిలో వర్షపు చినుకులతో పాటు చేపలు కూడా పడ్డాయి. వర్షంలో చేపలు పడటాన్ని చూసి ఆశ్చర్యం వ్యక్తం చేసిన ఆ గ్రామ వాసులు, వెనువెంటనే చేపలు పట్టేశారు. ఇలా వర్షంలో ఆకాశం నుంచి పడ్డ చేపల్లో అరకిలో బరువున్న చేపలు కూడా ఉన్నాయని గోళ్లమూడి వాసులు చెబుతున్నారు. గతంలో వడగళ్ల వానను చూశాం కాని, ఇలా వర్షంలో చేపలు పడటాన్ని చూడటం ఇదే తొలిసారి అని వారు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ విషయంపై తెలుగు రాష్ట్రాల్లో ఆసక్తికర చర్చకు తెరలేచింది. అర కిలో బరువున్న చేపలు వర్షపు చినుకులతో కలిసి ఆకాశం నుంచి ఎలా పడ్డాయన్న అంశంపై తెలుగు ప్రజలు చర్చోపచర్చల్లో మునిగిపోయారు. ఇదిలా ఉంటే, వర్షంలో చేపలు పడటం పెద్ద వింతేమీ కాదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. టోర్నడోలతో కూడిన భారీ వర్షాల్లో పెద్ద చేపలతో పాటు కప్పలు, పాములు పడిన సందర్భాలు అనేకం ఉన్నాయని వారు నిన్నటి ‘చేపల వర్షం’పై స్పందించారు.