: చంద్రబాబు ఇంటికి కాంపౌండింగ్ ఫీజు?...పావులు కదుపుతున్న జీహెచ్ఎంసీ!


హైదరాబాదులో ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు పునర్నిర్మించుకుంటున్న నివాసంపై రేకెత్తిన వివాదం మరింత ముదిరేలా కనిపిస్తోంది. ఇప్పటికే ప్లాన్ సరిగా లేదన్న కారణంగా జీహెచ్ఎంసీ అధికారులు చంద్రబాబు ఇంటికి అనుమతి నిరాకరించారు. తాజాగా చంద్రబాబు నుంచి కాంపౌండింగ్ ఫీజును వసూలు చేసేందుకు కూడా జీహెచ్ఎంసీ సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. సాధారణంగా నగర పాలక సంస్థ నుంచి అనుమతులు వచ్చిన తర్వాతే నిర్మాణాలను ప్రారంభించాల్సి ఉంది. అందుకు విరుద్ధంగా నిర్మాణాలను ప్రారంభించేసి, ఆ తరువాత అనుమతి కోసం దరఖాస్తు చేసుకునేవారిపై అధికారులు కాంపౌండింగ్ ఫీజును వసూలు చేస్తున్నారు. ఈ తరహా కేసుల్లో 33 శాతం మేర ఫీజును వసూలు చేస్తుండటం తెలిసిందే. చంద్రబాబు ఇంటి నిర్మాణం కూడా అనుమతికి ముందే మొదలైందని జీహెచ్ఎంసీ అధికారులు గుర్తించారట. చంద్రబాబు దరఖాస్తు నేపథ్యంలో పరిశీలనకు వెళ్లిన జీహెచ్ఎంసీ టౌన్ ప్లానింగ్ అధికారులకు అక్కడ పిల్లర్లు, కాలమ్ పనులు కనిపించాయని సమాచారం. అనుమతి రాకముందే నిర్మాణాలను దాదాపుగా నిర్ధారించుకున్న అధికారులు, ఏ మేరకు ఫీజును వసూలు చేయాలన్న అంశంపై చర్చలు జరుపుతున్నారట. ప్రస్తుతం ఈ విషయంపై జీహెచ్ఎంసీలో జోరుగా చర్చ సాగుతోంది.

  • Loading...

More Telugu News