: ఇక ఏపీ పోలీసుల వంతు... ‘టీ న్యూస్’ ఛానెల్ కు నోటీసుల జారీ
ఓటుకు నోటు కేసులో కేంద్రం జోక్యంతో ఇప్పుడిప్పుడే పరిస్థితులు చక్కబడుతున్నాయనుకుంటున్న తరుణంలో నిన్న రాత్రి పొద్దుపోయిన తర్వాత ఏపీ పోలీసులు అనూహ్యంగా స్పందించారు. తెలంగాణలోని ప్రముఖ న్యూస్ ఛానెల్ ‘టీ న్యూస్’కు నోటీసులు జారీ చేశారు. ఏపీలోని విశాఖపట్నం నుంచి వచ్చిన అసిస్టెంట్ పోలీస్ కమిషనర్ రమణ నేరుగా టీ న్యూస్ కార్యాలయం చేరుకున్నారు. ఛానెల్ సీఈఓగా వ్యవహరిస్తున్న నారాయణరెడ్డికి నోటీసులు అందజేశారు. అంతేకాక నారాయణరెడ్డి నుంచి కౌంటర్ కాపీని తీసుకున్నారు. తెలంగాణ ఎమ్మెల్యే స్టీఫెన్ సన్ తో ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు మాట్లాడారని చెబుతున్న ఆడియో టేపును ప్రసారం చేసిన కారణంగా ఎందుకు చర్యలు తీసుకోరాదో తెలపాలని సదరు నోటీసుల్లో ఏపీ పోలీసులు ఆ ఛానెల్ ను ప్రశ్నించారు. రాత్రి దాదాపు 11 గంటలు దాటిన ప్రాంతంలో ఈ నోటీసుల జారీ రెండు తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపింది. ఇదిలా ఉంటే, ఈ ఆడియో టేపును ప్రసారం చేసిన ‘సాక్షి’ ఛానెల్ కు కూడా ఏపీ పోలీసులు నోటీసులు జారీ చేయనున్నారన్న వార్తలు వినిపించినా, పోలీసులు ఆ దిశగా చర్యలు చేపట్టలేదు.