: 'బాహుబలి' తొలివీడియో పాట అదుర్స్
దేశం మొత్తం ఆసక్తిగా ఎదురుచూస్తున్న ప్రతిష్ఠాత్మక సినిమా 'బాహుబలి' తొలి పాటను సోషల్ మీడియాలో దర్శకుడు రాజమౌళి విడుదల చేశాడు. 'బాహుబలి' పోస్టర్లను ఒకటి తరువాత ఒకటిగా సోషల్ మీడియాలో విడుదల చేసి, అభిమానుల్లో సినిమాపై రాజమౌళి అంచనాలు పెంచేశాడు. తాజాగా వీడియో పాట విడుదల చేయడంతో అందరి అంచనాలు అందుకుంటానని చెప్పకనే చెప్పాడు. కాగా, సోషల్ మీడియాలో విడుదలైన 'బాహుబలి' తొలి పాటకు విశేషమైన ఆదరణ లభిస్తోంది. పాట ద్వారా రమ్యకృష్ణ, ప్రభాస్, రానా పాత్రలను అభిమానులకు రాజమౌళి పరిచయం చేశాడు. పాటను అభిమానులు లైకులు, షేర్లు, కామెంట్లతో అభినందిస్తున్నారు. కాగా, ఈ సినిమా హిందీ వెర్షన్ సాంగ్ ను ప్రముఖ దర్శకుడు కరణ్ జోహర్ విడుదల చేశాడు. కాగా, 'బాహుబలి' సినిమా తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో రూపొందింది. వచ్చే నెల 10న అభిమానుల ముందుకు 'బాహుబలి' తొలి భాగం రానున్న సంగతి తెలిసిందే.