: ప్రజలు తరుముతుంటే, కాల్వలో పడి దొంగ దుర్మరణం
దొంగతనం చెయ్యడానికి వచ్చిన ఓ వ్యక్తి ప్రమాదవశాత్తూ కాలువలో పడి మరణించాడు. ఈ ఘటన నెల్లూరులో జరిగింది. నగరంలోని పప్పుల వీధిలో ఒక ఇంట్లో చోరీ చేసేందుకు దొంగ వచ్చాడు. దీన్ని గమనించిన ప్రజలు దొంగను పట్టుకునే ప్రయత్నం చేశారు. జనాలు తరుముతుంటే, తప్పించుకునే ప్రయత్నంలో వేగంగా పరుగెడుతూ, అక్కడికి సమీపంలోని కాలువలో పడిపోయాడు. ఈ ప్రమాదంలో తీవ్రగాయాలై మరణించాడు. స్థానికుల ఫిర్యాదు మేరకు అక్కడికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు వివరించారు.