: తొమ్మిదో తరగతి మానేసిన బాలుడు... రెండేళ్ల తరువాత రెండు కంపెనీలకు అధిపతి


ఆ బాలుడికి సంప్రదాయ విద్యా విధానం అంటే నచ్చదు. మొక్కుబడిగా చదివి పరీక్షలు రాసి పాస్ కావడమంటే అయిష్టం. కొత్త వస్తువులు తయారు చేయడం అంటే ఇష్టం. టీవీలు చూసి, పుస్తకాల్లో చదివి వింత ఆవిష్కరణలు చేసి చూపించడం, కొత్త ప్రయోగాలు చేస్తుండడం చిన్నప్పటి నుంచి అలవాటు. పదేళ్ల వయసులోనే 'హోవర్ క్రాఫ్ట్' తయారు చేస్తానని తండ్రికి చెబితే, ఆయన ప్రోత్సహించాడు. దాంతో ఆ బాలుడి జిజ్ఞాస మరింతగా పెరిగింది. అతడి పేరు అంగద్ దర్యానీ. చదువుమాని ఇంకేదో చెస్తానంటూ, తొమ్మిదో తరగతిలోనే స్కూలును వదిలేశాడు. "ఓ పుస్తకంలోని విషయాన్ని చదివి, దాన్ని పరీక్షల్లో రాసి ఆపై మరచిపోయే చదువులు అనవసరం" అంటాడీ అంగద్. స్కూలు మానిన తరువాత తన ఆలోచనలు పంచుకుంటూ, ఎంఐటీ చదివిన వారితో పరిచయాలు పెంచుకుని ఇప్పుడు రెండు కంపెనీలు నడుపుతున్నాడు. ఈ కంపెనీలు, కొత్త ఆవిష్కరణలను, ఉత్సుకత కలిగించే ప్రొడక్టులను తయారు చేస్తున్నాయి. అంగద్ టీమ్ ఇప్పటికే పీడీఎఫ్ ఫార్మాట్ డాక్యుమెంటును బ్రెయిలీ లిపిలోకి కన్వర్ట్ చేసే సాంకేతికతను కనుగొని టెక్ ప్రపంచాన్ని అబ్బుర పరిచారు. ఒకవైపు కంపెనీలను నిర్వహిస్తూనే, స్కూలుకెళ్లి విద్యను అభ్యసించడం ప్రారంభించాడు. ఎంత వినూత్నంగా ఆలోచించినా, చదువు కూడా ఉండాలని తెలుసుకున్నానని అంటున్నాడు. అయితే, తాను డిగ్రీల వెంట పరుగులు పెట్టనని తెలిపాడు. విదేశీ పెట్టుబడుల కోసం చూడకుండా, టూరిజానికి, ఉత్పత్తి పరిశ్రమలకు మరింత ప్రోత్సాహాన్ని ఇవ్వడం ద్వారా ముందడుగు వేయవచ్చని, సవాళ్లు ఎదురైనప్పుడు ఎదురు నిలిచి పోరాడాలని సలహా ఇస్తున్నాడు.

  • Loading...

More Telugu News