: ఇకపై మహిళలకూ రాత్రి విధులు: మహారాష్ట్ర ఉత్తర్వులు
వేలాది మంది మహిళలకు ఉపాధితో పాటు చిన్న పరిశ్రమలకు ఊరట కలిగిస్తూ, మహారాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మహిళలు ఇకపై రాత్రి సమయాల్లోనూ విధులకు హాజరు కావచ్చని, అదే సమయంలో వారి భద్రతకు సంబంధించిన బాధ్యత పూర్తిగా కంపెనీల యాజమాన్యాలదేనని స్పష్టం చేసింది. 'కచ్చితమైన నియమ నిబంధనల్ని అమలు చేసే పరిస్థితుల్లోనే వారిని విధులకు రమ్మనాలి' అని ప్రభుత్వం ఆదేశాలిచ్చినట్టు అధికారులు వెల్లడించారు. కాగా, ఈ నిర్ణయంతో మహారాష్ట్రలోని సుమారు 14 వేలకు పైగా సంస్థలకు ప్రయోజనం కలగనుంది. ప్రస్తుతం ముంబైలోని చిన్న, మధ్య తరహా పరిశ్రమల్లో ఉదయం ఆరు నుంచి సాయంత్రం ఆరు వరకే మహిళలు పనిచేయవచ్చు. ఆ తరువాత వారికి పనిచేసే అవకాశాలున్నా, భద్రత దృష్ట్యా అనుమతులు లేవు. ఈ విషయాన్ని మరోసారి పరిశీలించాలని పలు సంస్థల యాజమాన్యాలు ప్రభుత్వానికి విన్నవించగా, అన్ని అంశాలనూ పరిగణనలోకి తీసుకున్న ప్రభుత్వం, మహిళా కార్మికుల భద్రత పట్ల పలు సూచనలు చేస్తూ, రాత్రి వేళ విధులకు అనుమతించింది. వారి కనీస అవసరాలన్నీ యాజమాన్యాలు చూడాల్సి వుంటుందని, భద్రత పరమైన లోపాలు కనిపిస్తే, కంపెనీని మూసేస్తామని హెచ్చరించింది.