: జీహెచ్ఎంసీ కమిషనర్ పై టీడీపీ వర్గాల మండిపాటు


ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు జీహెచ్ఎంసీ గృహనిర్మాణ అనుమతి మంజూరు చేయకపోవడాన్ని టీడీపీ వర్గాలు తీవ్రంగా పరిగణిస్తున్నాయి. కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే ఆయన ఇంటి నిర్మాణ ప్లాన్ ను తిరస్కరించారని ఆరోపిస్తున్నాయి. జీహెచ్ఎంసీ కమిషనర్ సోమేశ్ కుమార్ సర్కారుకు తన విధేయత చాటుకునేందుకు బాబును ఇబ్బందులకు గురిచేస్తున్నారని నేతలు మండిపడ్డారు. హైదరాబాదులో చంద్రబాబును ఇల్లు నిర్మించుకోనివ్వరా? అంటూ ప్రశ్నిస్తున్నారు. పాత నివాసం స్థానంలో అన్ని సౌకర్యాలతో కొత్త ఇంటిని నిర్మించుకోవాలని భావించిన టీడీపీ అధినేత మే 18న జీహెచ్ఎంసీకి ప్లాన్ అందజేశారు. అయితే, జూన్ 16న ఆ ప్లాన్ ను జీహెచ్ఎంసీ తిప్పి పంపింది. నిబంధనలకు అనుగుణంలేదని ఆ ప్లాన్ కు ఆమోదముద్ర వేసేందుకు నిరాకరించారు. దీనిపై తెలుగుదేశం పార్టీ మీడియా కమిటీ చైర్మన్ ఎల్వీఎస్ఆర్కే ప్రసాద్ మాట్లాడుతూ... ప్లాన్ ను అసిస్టెంట్ సిటీ ప్లానర్, డిప్యూటీ సిటీ ప్లానర్, చీఫ్ సిటీ ప్లానర్ ఆమోదించారని, కానీ, జీహెచ్ఎంసీ కమిషనర్ మాత్రం తిరస్కరించారని దుయ్యబట్టారు. ప్లాన్ నిబంధనలకు అనుగుణం లేకపోతే తొలి దశలోనే దాన్ని తిప్పి పంపాలని, మరి అలాంటప్పుడు అది కమిషనర్ దాకా ఎలా వెళ్లిందని ప్రశ్నించారు. అధికారులు ఆమోదం తెలిపితే కమిషనర్ ఎలా కాదన్నారని నిలదీశారు. ఇది కక్ష సాధింపు చర్యగానే తాము భావిస్తున్నామని ఆయన స్పష్టం చేశారు.

  • Loading...

More Telugu News