: జరిగింది చాలు... ఇకనైనా తగ్గండి!: తెలుగు రాష్ట్రాలకు కేంద్రం సూచన
ఓటుకు నోటు వ్యవహారంపై ఎట్టకేలకు కేంద్రం దృష్టి సారించింది. ‘‘ఇప్పటిదాకా జరిగింది చాలు... ఇకనైనా తగ్గండి’’ అంటూ ఈ కేసులో సిగపట్లకు సిద్ధపడ్డ తెలుగు రాష్ట్రాలకు కాస్త గట్టిగానే ఆదేశాలు జారీ చేసింది. 'మరీ రచ్చకెక్కేదాకా వ్యవహారాన్ని లాగకండి' అంటూ నిన్న కేంద్ర మంత్రివర్గంలోని ఓ కీలక మంత్రి ఇరు రాష్ట్రాల సీఎంలకు సందేశాలు పంపారు. అంతేకాక ఈ వ్యవహారంలో మరింత ముందుకెళ్లదలిస్తే, ఎదురయ్యే ఇబ్బందులకు బాధ్యత వహించాల్సి ఉంటుందని కూడా హెచ్చరికలు జారీ చేశారట. కేంద్ర మంత్రి సూచనలతో ఇరు రాష్ట్రాల ప్రభుత్వాలు ఈ కేసుపై స్పీడు తగ్గించేందుకు సంసిద్ధత వ్యక్తం చేసినట్లు సమాచారం. నిన్న తమను కలిసిన తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ తో ఈ విషయాన్ని ప్రస్తావించిన కేంద్ర మంత్రులు వెంకయ్యనాయుడు, రవిశంకర్ ప్రసాద్ లు ఇకపై దూకుడు తగ్గించకపోతే ఇబ్బందులు తప్పేలా లేవని కాస్త మృదువుగానే హెచ్చరికలు జారీ చేశారని విశ్వసనీయ సమాచారం. ఇదే విషయాన్ని కేసీఆర్ కు తెలపాలని, ఈ వివాదానికి ఇంతటితో తెర దించాలని కూడా వారు కేటీఆర్ కు సూచించారు. ఇక కేంద్ర మంత్రి, టీడీపీ సీనియర్ నేత సుజనా చౌదరి నిన్న పలువురు కేంద్ర మంత్రులతో భేటీ అయ్యారు. సుజనా చౌదరి ద్వారా ఏపీ సీఎం చంద్రబాబునాయుడికి కూడా కేంద్రం తన సందేశాన్ని పంపినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఇరు రాష్ట్రాల మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు నేడో, రేపో పూర్తిగా చల్లబడే అవకాశాలు లేకపోలేదన్న వాదన వినిపిస్తోంది.