: విజయ్ మాల్యా విమానాన్ని ఏ భాగానికి ఆ భాగం విడదీస్తున్నారు!
ఒకప్పుడు భారత వ్యాపార రంగంలో తిరుగులేని వ్యక్తిగా వెలుగొందిన లిక్కర్ కింగ్ విజయ్ మాల్యా ఇప్పుడు పతనం అంచుల్లో ఊగిసలాడుతున్నారు. బ్యాంకులతో వివాదాలు, సంస్థలతో పేచీలు ఆయన ప్రతిష్ఠను పాతాళానికి చేర్చాయి. ఆర్భాటంగా ప్రారంభించిన కింగ్ ఫిషర్ ఎయిర్ లైన్స్ అప్పులను మిగిల్చగా... ఉద్యోగులకు జీతాలు కూడా ఇవ్వలేని దయనీయ పరిస్థితుల్లో బోర్డు తిప్పేశారు. ఇక, ఆయనకు చెందిన మద్యం సంస్థల పరిస్థితి కూడా ఏమంత ఆశాజనకంగా లేదు. ఇవన్నీ విజయ్ మాల్యాను ఉక్కిరిబిక్కిరి చేశాయి. అత్యంత విచారకరమైన విషయం ఏమిటంటే... బకాయిలు చెల్లించలేదంటూ ఆయనకు చెందిన 11 సీట్ల ప్రైవేట్ జెట్ విమానాన్ని ముంబయి ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు అథారిటీ వేలం వేసింది. ఆ విమానాన్ని సైలెంట్ ఎంటర్ ప్రైజెస్ అనే సంస్థ రూ.22 లక్షలకు చేజిక్కించుకుంది. అయితే, సదరు సంస్థ విమానాన్ని ఏంచేసిందో తెలిస్తే విస్తుపోతారు! విడిభాగాలుగా అమ్మేసింది. ప్రస్తుతం ఆ విమానాన్ని ఏ భాగానికి ఆ భాగం విడదీసే ప్రయత్నం జరుగుతోంది. వచ్చే వారం నాటికి ఈ విడదీసే కార్యక్రమం పూర్తవుతుందని అంచనా.