: సీఎం కేసీఆర్ పై మంత్రి పల్లె మాటల దాడి
తెలంగాణ సీఎం కేసీఆర్ పై మంత్రి పల్లె రఘునాథ రెడ్డి మాటల దాడి చేశారు. ఆయనొక మాటల మరాఠీ అని, లేనిది ఉన్నట్టు, ఉన్నది లేనట్టు మాట్లాడడంలో ఘనాపాటి అని విమర్శించారు. ప్రమాదకరమైన, రాజ్యాంగ విరుద్ధమైన ఫోన్ ట్యాపింగ్ నేరానికి పాల్పడ్డారని పల్లె మండిపడ్డారు. 'రానున్న గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో లబ్ధి కోసమే కేసీఆర్ తాపత్రయమంతా' అని వ్యాఖ్యానించారు. ఏపీ సచివాలయంలో మీడియాతో ఈ మేరకు ఆయన మాట్లాడారు. రాజకీయ భిక్ష పెట్టిన టీడీపీకే వెన్నుపోటు పొడుస్తున్నారన్న పల్లె, ఏపీ ప్రజల పట్ల కేసీఆర్ పగబట్టి, రౌడీలా వ్యవహరిస్తున్నారని అన్నారు. ఇక తెలుగు ప్రజలను విడగొట్టిన తల్లి కాంగ్రెస్ ను ఏపీలో ప్రజలు భూస్థాపితం చేశారని, పిల్ల కాంగ్రెస్ కూ అదే గతిపడుతుందని హెచ్చరించారు. వైసీపీ అధినేత జగన్ టీఆర్ఎస్ గౌరవ అధ్యక్షుడిగా పనిచేస్తున్నారన్న మంత్రి, ఆయనకు కూడా ఏపీ ప్రజలు బుద్ధి చెబుతారని అన్నారు.